‘వివేకం’ ప్రదర్శనను నిలిపివేయాలని వ్యాజ్యం
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:36 AM
సాధారణ ఎన్నికల షెడ్యూల్ ముగిసే వరకు మాజీమంత్రి వివేకానందరెడ్డి బయోపిక్‌గా చెప్పబడుతున్న వివేకం సినిమాను యూట్యూబ్, ఓటీటీలలో ప్రదర్శించకుండా, నిలుపుదల చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వివేకానందరెడ్డి హత్యలో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): సాధారణ ఎన్నికల షెడ్యూల్ ముగిసే వరకు మాజీమంత్రి వివేకానందరెడ్డి బయోపిక్‌గా చెప్పబడుతున్న వివేకం సినిమాను యూట్యూబ్, ఓటీటీలలో ప్రదర్శించకుండా, నిలుపుదల చేసేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వివేకానందరెడ్డి హత్యలో నిందితుడిగా ఉన్న షేక్ దస్తగిరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, ఎన్నికల సంఘాన్ని న్యాయస్థానం ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ మంగళవారం ఆదేశాలిచ్చారు. దస్తగిరి తరఫున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. సీబీఐకి, పులివెందుల కోర్టుకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వివేకం సినిమా తీశారని, అతన్ని అభాసుపాల్జేసేలా సినిమాలో నేరుగా పేరువాడారని తెలిపారు. ఈ సినిమాను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ఓ రాజకీయపార్టీ ప్రయత్నిస్తోందన్నారు. పిటిషనర్ దస్తగిరి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని, ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శను నిలుపుదల చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు.