Share News

వైసీపీదైతే వదిలేయ్‌!

ABN , Publish Date - May 11 , 2024 | 05:34 AM

’ఆ.. రెడ్డితో నీకేంటయ్యా గొడవ’ ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నుంచి ప్రకాశం జిల్లాలోని ఒక పోలీసు అధికారికి వచ్చిన ఫోను ఎత్తగానే వినిపించిన మాట ఇది.

వైసీపీదైతే వదిలేయ్‌!

అక్రమ మద్యంపై అధికారుల తీరు

జిల్లాల్లో పోలీసులకు బాస్‌ల నుంచి ఫోన్లు

ఆ.. రెడ్డితో నీకేంటయ్యా? ఓ అధికారికి తలంటు

సీమ రెడ్డి సరుకు.. పట్టుకునే ముందు చూసుకోరా?

గోదావరి జిల్లాల్లో ఇద్దరు అధికారులకు చీవాట్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

’ఆ.. రెడ్డితో నీకేంటయ్యా గొడవ’ ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి నుంచి ప్రకాశం జిల్లాలోని ఒక పోలీసు అధికారికి వచ్చిన ఫోను ఎత్తగానే వినిపించిన మాట ఇది. ‘అయ్యో.. ఆయనతో నాకేం ఉంటుంది సర్‌’ అంటూ భయం భయంగా బదులిచ్చారు ఆ అధికారి. ‘సమాచారం ఏదైనా వస్తే సెర్చ్‌(తనిఖీలు)కు వెళ్లే ముందు వెనకున్నది ఎవరో తెలుసుకో.. ఎస్‌ఐ నుంచి పైకి వచ్చావ్‌గా.. డిపార్ట్‌మెంట్‌లో ఇన్నేళ్లు పనిచేశాక కూడా ఏది ఎలా చేయాలో తెలుసుకోక పోతే ఎలా?’ అంటూ ఆ అధికారి ఫోన్‌ పెట్టేశారు. ఆ షాక్‌ నుంచి అధికారి తేరుకునేలోపు మరో పెద్ద ఐపీఎస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘తలకాయలేని పనులు చేయమాకండయ్యా.. అదేదో సరుకు పట్టుకున్నావటగా..’ అంటూ ఉన్నతాధికారి ప్రశ్నించగా.. ‘అదెవరిదో సెర్చ్‌కు వెళ్లే ముందు మాకు తెలీదు సర్‌. సమాచారం రాగనే వెళ్లాం. ఎన్నికల టైమ్‌లో నిక్కచ్చిగా ఉండమని తమరు చెప్పారు కదా సర్‌. అందుకే ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లాం సర్‌’ అంటూ కొంత ధైర్యం తెచ్చుకుని సమాధానం ఇచ్చాడు. ‘మంచిదే కానీ నా దాకా ఫోన్లు వస్తున్నాయంటే చూసుకోండి.. జాగ్రత్త’ అంటూ పెద్ద సార్‌ ఫోను పెట్టేశారు. ఇద్దరు ఉద్ధండుల్లాంటి అధికారులు ఫోన్లు చేయడంతో భయపడిన జిల్లా అధికారి.. అధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ఫోను చేసి.. ‘మాకు సమాచారం వచ్చినప్పుడు మీదని తెలీదు’ అని చెబుతుండగానే.. ‘మాకు తెలుసులే అన్నా మీరు పక్కా సమాచారంతోనే పట్టుకున్నారని.. మీరేం చేస్తున్నారో అంతా తెలుసు’ అని ఫోన్‌ కట్‌ చేశారు. ఈ వ్యవహారం రెండు రోజుల్లోనే రాష్ట్రమంతా వ్యాపించడంతో క్షేత్రస్థాయి అధికారుల్లో భయం పట్టుకుంది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికార పార్టీకి చెందిన అక్రమ మద్యం సీజ్‌ చేయడం బాగా తగ్గిపోయింది. ఒకటి రెండు చోట్ల ఏదో పట్టుకున్నట్లు చూపించేందుకు కేసు పెట్టినా.. పట్టుబడ్డ లిక్కర్‌ ఆ తర్వాత ఏమవుతోందన్నది ప్రశ్నార్థకం. ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్‌ అధికారులతో లెటర్‌ తీసుకుని ఈసీకి సమర్పిస్తున్నామని అధికారులు పైకి చెబుతున్నారు. కానీ, ఈ విషయంలోనూ విపక్షాల సరుకైతే ఒకలా.. అధికార పక్షానిదైతే మరో విధంగా పనికానిస్తున్నారు.

ఇదీ తీరు!

గన్నవరంలో ప్రతిపక్ష పార్టీకి చెందినదిగా పోలీసులు వెల్లడించిన మద్యం బాటిళ్లను కలెక్టరు, జిల్లా ఎస్పీ సమక్షంలో ధ్వంసం చేశారు. ఫొటోలు, వీడియోలు మీడియాకు విడుదల చేశారు. కానీ, ఇతర ప్రాంతాల్లో వైసీపీ నేతలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకున్న మద్యాన్ని మాత్రం ఇలా ధ్వంసం చేయడం లేదు. ఈ విషయంపై పోలీసులు ఎవరూ స్పందించడమే లేదు. ఇక, రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా పట్టుబడుతున్న అక్రమ మద్యం కేసుల్లో పోలీసు, సెబ్‌ అధికారులు వ్యవహరించిన తీరు గమనిస్తే.. ఏకపక్షం అనడం కన్నా సహకారం, ఉపకారం అనొచ్చు. ఇక, సీఎం జగన్‌ పాల్గొంటున్న సభలు, రోడ్‌ షోలకు జనం రాకపోవడంతో దిక్కుతోచని నేతలు జనాలను తరలించేందుకు రూ.500, బిర్యానీ పొట్లం ఆఫర్‌ చేస్తున్నారు. పురుషులైతే మద్యం బాటిల్‌ కూడా ఇస్తున్నారు. దీంతో వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు ఈ మద్యం సరఫరా కాంట్రాక్టు తీసుకున్నారు. గోవా నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమో అక్కడికి చేరవేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నా ‘పెద్దగా’ పట్టించుకోవడం లేదు. ఒకటో అరో పట్టుకున్నట్టు మీడియాకు సమాచారం ఇచ్చి ఫొటోలు దిగేసిన తర్వాత సరుకు మాయం చేస్తున్నారు.

పిఠాపురంలో గోవా మద్యం

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించేందుకు సీఎం జగన్‌ కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ మండలానికో మంత్రిని రంగంలో దింపారు. రాయల సీమలో తనకు దగ్గరగా ఉండే ఒక ఎంపీకి బాధ్యతలు అప్పగించారు. దీంతో జగన్‌ కళ్లలో ఆనందం కోసం.. సదరు నేత గోవా నుంచి మద్యం తెప్పించి ఒక్క పిఠాపురమే కాకుండా ఉభయగోదావరి జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందుతూనే ఉంది. అయినా కొన్ని రోజులు పోలీసులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. మీడియాలో విస్తృతంగా కథనాలు రావడంతో ఎట్టకేలకు కదిలిన పోలీసులు పిఠాపురంలో దాచిన గోవా మద్యా న్ని పట్టుకున్నారు. అయితే, తర్వాత దానిని మాయం చేశారు. అలా ఎందుకు చేశారని ఆరా తీస్తే.. ఆ మద్యం పట్టుకున్న పోలీసులు, సెబ్‌ అధికారులకు పైనుంచి ‘క్లాసు తీసుకున్నట్టు’ తెలిసింది. ‘అది సీమ రెడ్డి సరుకు.. పట్టుకునే ముందు చూసుకోరా? ఏదో ఫోన్‌ వస్తే చాలు వెళ్లి పట్టుకోవడమేనా? తప్పదనిపిస్తే ముందే సమాచారం లీక్‌ చేసి సోదాలకు వెళ్లాలి’ అంటూ చీవాట్లు పెట్టడంతో మాకేంటీబాధ అంటూ క్షేత్రస్థాయి అధికారులు వాపోతున్నారు. చివరికి అదే రెడ్డిగారి వద్ద కెళ్లి ‘మా పైఅధికారులకు చెప్పొద్దు సార్‌. ఏదో ఒకటి చేస్తాం’ అని బతిమాలుకుని మద్యం వెనక్కిచ్చేశారు. ఈసీకి మాత్రం ‘ధ్వంసం’ చేసినట్లు ఎక్సైజ్‌ అధికారితో ఆథరైజేషన్‌ తీసుకుని సమర్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కీలకంగా వ్యవహరించిన ఓ అధికారి తన ఆప్తమిత్రుడికి ఫోనుచేసి ‘ఆ లింకు పట్టుకుని ముందుకు వెళ్తే భారీడంప్‌ దొరికేది. లారీలకు లారీల సరుకు పట్టుబడేది. ముందుకు వెళ్లలేకపోయాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏంటి బాసూ ఇది!

ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కాపు కాయాల్సిన పోలీసులే దారి తప్పుతున్నారు. అధికార పక్షానికి అన్ని విధాలా సహకరిస్తున్నారు. మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారు. వైసీపీ నేతల అక్రమాలపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిక్కచ్చిగా పనిచేస్తున్న అధికారులపైనా పైనుంచి ‘బాసు’లు ఒత్తిడి తెచ్చి అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కోడ్‌ నిబంధనలను సైతం తుంగలో తొక్కుతున్నారు.

అడ్డదారులు ఎన్నెన్నో!

కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఆలమూరులో వైసీపీ నేతలు పంపిణీకి సిద్ధం చేసిన మద్యం పట్టుబడింది. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలీదు.

అనకాపల్లి జిల్లాలో ఎలమంచిలి వైసీపీ నేత ఓటర్లకు పంచేందుకు తెప్పించిన పొరుగు మద్యం కూడా పట్టుబడింది. కానీ, తర్వాత మాయమైంది.

వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజోలులో 1200 కేసుల గోవా మద్యం పట్టుబడితే కనీసం ఫొటో కూడా బయటకు రాలేదు. ఎందుకంటే గుట్టుచప్పుడు కాకుండా మాయచేశారు.

రాయలసీమలో పట్టుబడుతున్న అక్రమ మద్యంలో అరకొర చూపించడం మిగతాది మాయం చేయడం సర్వసాధారణంగా మారిందని కొందరు పోలీసులు గుసగుసలాడుతున్నారు.

చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని ఓ గ్రామ సర్పంచ్‌ గోవా మద్యాన్ని భారీగా తెప్పించి పంచాయుతీ భవనంలోనే డంప్‌ చేశారు. ప్రచారానికి వచ్చే మందుబాబులకు రోజూ పంచుతున్నారు. అయినా, పోలీసులు పట్టించుకోవడం లేదు. చివరికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేసి రచ్చ చేయడంతో నాలుగైదు బాక్సుల మద్యం సీజ్‌ చేసి మమ అనిపించేశారు.

పోలింగ్‌ పూర్తయ్యే వరకు రోజూ మూడు ట్రక్కుల గోవా మద్యం తెప్పించేందుకు చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు లిక్కర్‌ డాన్‌లతో వైసీపీ ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై పోలీసుల్లోనూ చర్చసాగుతోంది.

Updated Date - May 11 , 2024 | 05:34 AM