Share News

ఆ రెండింటిని రాజధానికి మార్చుతాం

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:25 PM

ఏపీ లోకాయుక్త సంస్థ, ఏపీ మావన హక్కుల కమిషన (హెచఆర్‌సీ) కర్నూలు నుంచి అమరావతికి తరలించనున్నారా..?

   ఆ రెండింటిని రాజధానికి మార్చుతాం

అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన..!

అందుకు వీలుగా చట్ట సవరణ చేస్తాం

కోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ లోకాయుక్త సంస్థ, ఏపీ మావన హక్కుల కమిషన (హెచఆర్‌సీ) కర్నూలు నుంచి అమరావతికి తరలించనున్నారా..? రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో బుధవారం జరిగిన విచారణలో అమరావతిలోనే ఈ రెండు ఉంటాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా చట్ట సవరణ చేస్తామని కోర్టుకు వివరించారు. అంటే.. ఏ క్షణమైనా ఏపీ లోకాయుక్త సంస్థ, ఏపీ మానవ హక్కుల కమిషన (హెచఆర్‌సీ)లు కర్నూలు నుంచి తరలిపోయే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే.. కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన వీటిని ఇక్కడే ఉంచాలని, కొత్త సంస్థలను తీసుకు రావడం దేవుడెరుగు.. ఉన్న సంస్థలను తరలించడం ఎంతవరకు భావ్యమని న్యాయకోవిదులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జాతీయ న్యాయ విద్యా కళాశాల విజయవాడలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తాజాగా ఈ రెండింటిని కూడా తరిలించేందుకు చట్ట సరవణ చేస్తామని సాక్షాత్తు హైకోర్టుకే తెలిపారంటే.. ఎప్పుడైనా తరలిపోయే అకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఏపీ హెచఆర్‌సీ, ఏపీ లోకాయుక్త సంస్థల తరలింపుపై మద్దిపాటి శైలజ, ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన హైకోర్టులో దాఖాలు చేసిన పిటిషన విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రభుత్వ ఆలోచన విదానం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

రాష్ట్ర విభజన తరువాత కొలుదీరిన టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించింది. రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్‌ ఫూలింగ్‌ విధానం ద్వారా దాదాపు 33 వేల ఎకరాలు సేకరించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు సహా రాష్ట్ర ప్రధాన సంస్థలు అన్నింటిని కూడా అమరావతిలో ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు సారథ్యంలోని ఆనాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో హైదరాబాద్‌ నుంచి ఒక్కొక్కటిగా కార్యాలయాలు అమరావతికి తరలిస్తూ వచ్చారు. 2019లో జగన సారథ్యంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చింది. అందులో భాగంగా కర్నూలు న్యాయ రాజధానికిగా ప్రకటించారు. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. న్యాయ శాఖకు సంబంధించిన సంస్థలను కర్నూలులో ఏర్పాటుకు వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తాత్కాలి భవనం స్టేట్‌ గేస్ట్‌ హౌస్‌లో ఆంధ్రప్రదేశ మానవ హక్కుల కమిషన (హెచఆర్‌సీ) ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ - బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారి పక్కనే సంతోష్‌ నగర్‌లో ఏపీ లోకాయుక్త సంస్థను అద్దె భవనంలో ఏర్పాటు చేశారు. దిన్నెదేవరపాడులో శాశ్వత భవనంలో ఏపీ విద్యుత నియంత్రణ మండలి ఏర్పాటు చేశారు. ఎన్నికల ముందు నగర శివారులో జగన్నాథ గట్టుపై జాతీయ న్యాయ విద్యా కళాశాల నిర్మాణానికి అప్పటి సీఎం జగన హడావుడిగా శంకుస్థాపన చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక జాతీయ న్యాయ విద్యా కళాశాలను విజయవాడలో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అక్కడ మరో కళాశాల ఏర్పాటు చేస్తారా..? కర్నూలులో శంకుస్థాపన చేసిన కళాశాలనే తరలిస్తారా..? అన్నది స్పష్టత ఇవ్వలేదు. గత రెండు మూడేళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏపీ లోకాయుక్త సంస్థ, ఏపీ మానవ హక్కుల కమిషనలను మాత్రం ఇక్కడి నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఏపీ లోకాయుక్త, హెచఆర్‌సీలను విజయవాడ తరలిస్తే ఆ సంస్థల్లో ఎలాంటి ఫిర్యాదులు చేయాలన్నా దాదాపు 400 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సిందే. రాయలసీమ జిల్లాల ప్రజలకు అది సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ రెండు సంస్థలను ఇక్కడే కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:25 PM