మద్యంలో మతలబు!
ABN , Publish Date - Nov 06 , 2024 | 05:50 AM
సరుకు వాళ్లదే! షాపులూ సర్కారువే! మధ్యలో... నామమాత్రంగా బ్రూవరీస్ కార్పొరేషన్! డిస్టిలరీలలో తయారైన మద్యం బ్రూవరీస్ కార్పొషన్‌కు వచ్చి..
వైసీపీ సర్కారు దుకాణాల్లో భారీ గోల్‌మాల్!?
రోజుకు రూ.10 కోట్ల సరుకు ‘నేరుగా’ స్వాహా!?
వైసీపీ ప్రభుత్వంలో మద్యంలో భారీగా కమీషన్లు చేతులు మారాయనీ, ప్రతి మద్యం కంపెనీ.... కేసుకు రూ.200 చొప్పున.. ఐదేళ్లలో రూ.మూడు వేల కోట్ల విలువైన మద్యం సొమ్ములను తాడేపల్లి ప్యాలె్‌సకు చేర్చాయని కూటమి ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఇది ఒక లెక్క! అలాగే... డిస్టిలరీల నుంచి నేరుగా ప్రభుత్వ మద్యం షాపులకే సరుకు పంపించి, అనధికారికంగా విక్రయించారన్న అనుమానాలకు ఇప్పుడు ఆధారాలు లభిస్తున్నాయి. ఆ లెక్క ఎంతో సీఐడీ తేల్చాల్సి ఉంది.
పది రూపాయల టీ తాగినా గూగుల్‌పే, ఫోన్‌పేలో డబ్బులు చెల్లించే రోజుల్లోనూ... ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లను అనుమతించలేదు. ‘క్యాష్’ మాత్రమే కొట్టాలన్నారు! డిజిటల్ పేమెంట్లతో ప్రభుత్వ ఖాతాల్లోనే జమ అవుతుంది. అనధికారికంగా విక్రయించే సరుకు సొమ్ము చేతికి చిక్కదు! ఆ లెక్కల గుట్టు బయటపడొద్దనే జగన్ సర్కారు హయాంలో డిజిటల్ పేమెంట్లను అనుమతించలేదనే అనుమానాలున్నాయి.
కొత్త పాలసీలో పెరిగిన విక్రయాలు
బ్రాండెడ్ ధరలు మారకున్నా, చీప్ లిక్కర్ ధర సగానికి దిగినా
రోజుకు రూ.10 కోట్ల అదనపు విక్రయాలు గతంలో ఇదంతా ఏమైనట్లు?
డిస్టిలరీల నుంచి నేరుగా తరలించేశారా?
ఆ సొమ్మునూ సొంత ఖాతాల్లో వేసుకున్నారా?
డిజిటల్ పేమెంట్లు వద్దన్నది అందుకేనా?
ఇప్పటిదాకా ఎన్నెన్నో అనుమానాలు
ఇప్పుడు బలపడుతున్న ఆధారాలు
డిస్టిలరీలలో సీఐడీ సోదాల్లో తేలిన తేడా!?
లోతుగా విచారిస్తే మరింత స్పష్టత
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
సరుకు వాళ్లదే! షాపులూ సర్కారువే! మధ్యలో... నామమాత్రంగా బ్రూవరీస్ కార్పొరేషన్! డిస్టిలరీలలో తయారైన మద్యం బ్రూవరీస్ కార్పొషన్‌కు వచ్చి... అక్కడి నుంచి మద్యం దుకాణాలకు వెళ్లాలి! ఇదీ అధికారిక ప్రక్రియ! కానీ... కొంత మద్యం నేరుగా డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు వెళ్లిందని, అనధికార విక్రయాలు జరిగాయని తొలి నుంచీ అనుమానాలున్నాయి! వాటిని బలపరిచే ఆధారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అప్పటికీ, ఇప్పటికీ మద్యం విక్రయాల్లో రోజుకు సగటున రూ.10 కోట్ల వరకు తేడా వస్తోంది. జగన్ హయాంలో ప్రభుత్వ దుకాణాల్లో రోజుకు రూ.80 కోట్ల విలువైన మద్యం విక్రయించగా... ఇప్పుడు రూ.90 కోట్లకు పైగా విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం దుకాణాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకమునుపే ఇంత తేడా! ఈ పదికోట్ల విలువైన సరుకు గతంలో ఏమైంది? డిస్టిలరీల నుంచి నేరుగా మద్యం దుకాణాల్లో విక్రయించారా? లేక... సొంత బెల్టు షాపులకు తరలించారా? వాటిపై ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని నాటి పెద్దలు పంచుకున్నారా? ఇలా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకూ ప్రచారం, అనుమానాలుగానే ఉన్న ఈ అంశాలకు ఇప్పుడు బలమైన ఆధారాలు లభిస్తున్నాయి. అయితే, పక్కదారి పట్టిన సరుకు ఎంత అనేది తేల్చాల్సి ఉంది. గత ప్రభుత్వంలో రోజుకు సగటున రూ.80 కోట్ల మద్యం అమ్మితే, ఇప్పుడు రూ.90 కోట్లకు చేరింది.
అప్పటికీ, ఇప్పటికీ మద్యం ధరలు మారలేదు. కొత్త మద్యం పాలసీ వచ్చి, ప్రైవేటు షాపులు తెరుచుకుని 21 రోజులే అయ్యింది. తాగే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగే అవకాశమూ లేదు. అయినప్పటికీ... రోజువారీ విక్రయాలు రూ.10కోట్లు పెరగడం గమనార్హం! కూటమి సర్కారు అన్ని రకాల, ఖరీదైన బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చినందునే అమ్మకాలు పెరిగాయనే వాదన తేవచ్చు. కానీ... కొత్త పాలసీ వచ్చిన తొలి వారం పది రోజులు డిస్టిలరీల నుంచి పాత సరుకునే విక్రయించారు. అయితే... గతంలో పాపులర్ బ్రాండ్లను తక్కువగా, ‘జే’ బ్రాండ్లను అధికంగా షాపుల్లో అందుబాటులో ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. దీనివల్లే విక్రయాలు పెరిగాయనుకున్నా... రోజుకు రూ.10 కోట్లు తేడా వచ్చే అవకాశం ఎంతమాత్రం లేదు. మరోవైపు... జగన్ హయాంలో రూ.180 వరకు ఉన్న చీప్ లిక్కర్ ఇప్పుడు రూ.99కే దొరుకుతోంది. దీనికి చాలా డిమాండ్ ఉంది. అంటే... అమ్మకాల విలువ తగ్గాలి. అయినప్పటికీ... గతంతో పోల్చితే రోజుకు రూ.10కోట్ల మేరకు విక్రయాలు పెరిగాయి. అంటే... నెలకు దాదాపు రూ.300 కోట్లు! ఆ మేరకు వైసీపీ హయాంలో సరుకు పక్కదారి పట్టిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొత్త మద్యం పాలసీ వచ్చినప్పటి నుంచి మంగళవారం వరకు... అంటే 21 రోజుల్లో రూ.2,235 కోట్ల విలువైన మద్యాన్ని షాపులు, బార్లు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశాయి. వాటిలో కొంతమేర నిల్వ పెట్టుకున్నారని భావించినా, రూ.90 కోట్లకు తగ్గకుండా అమ్మకాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. అదే గత ప్రభుత్వంలో రోజుకు రూ.80 కోట్లు దాటి అమ్మకాలు లేవు.
సీఐడీ సోదాల్లో...
జగన్ హయాంలో డిస్టిలరీలన్నింటినీ వైసీపీ పెద్దలే నడిపించారు. నిబంధనల ప్రకారం డిస్టిలరీల్లో ఉత్పత్తి అయిన మద్యం నేరుగా దుకాణాలకు వెళ్లాలి. ఉత్పత్తికీ, విక్రయాలకూ మధ్య లెక్క సరిపోవాలి. కానీ... ఈ లెక్క తప్పిందని సీఐడీ గుర్తించినట్లు తెలిసింది. ఇటీవల అన్ని డిస్టిలరీలలో ఏకకాలంలో సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. అక్కడ జరిగిన ఉత్పత్తికీ, క్షేత్రస్థాయిలో జరిగిన విక్రయాలకూ మధ్య తేడా ఉన్నట్లు తేల్చారు. దీనిపై మరింత లోతుగా పరిశీలిస్తే... డిస్టిలరీల నుంచి నేరుగా ఎంత సరుకు దుకాణాలకు, బెల్టు షాపులకు తరలిపోయిందో తేలుతుంది.