Share News

శివారు కాలనీలపై చిన్నచూపు!

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:06 AM

పట్టణ శివారు కాలనీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తోంది. జనాభా రోజురోజుకూ పెరుగుతుండటంతో పట్టణం విస్తరించి శివారులో పలు కాలనీలు వెలిశాయి.

శివారు కాలనీలపై చిన్నచూపు!
సీసీ రోడ్డు లేని మైనార్టీకాలనీ

అభివృద్ధికి నోచుకోని కాలనీలు

ఇబ్బందుల్లో కాలనీల ప్రజలు

ఎమ్మిగనూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారు కాలనీలపై ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తోంది. జనాభా రోజురోజుకూ పెరుగుతుండటంతో పట్టణం విస్తరించి శివారులో పలు కాలనీలు వెలిశాయి. అయితే కాలనీల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు లేక ఆయ కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు కాలనీల్లో ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత వంటి సౌకర్యాలు కల్పించలేదు. పట్టణ శివారులో మైనార్టీ కాలనీ, మునెప్ప నగర్‌, రాధాకృష్ణ, న్యూ గణేష్‌ కాలనీ, టీబీపీ కాలనీ, మిలటరీ కాలనీ, ఎల్లమ్మ బీడు, సాయి కాలనీ, శివన్న నగర్‌, న్యూ ఎస్సీ కాలనీ, చంద్రయ్య కొట్టాల, కబరస్తాన కొట్టాల వంటి కాలనీలు వెలశాయి. అయితే అవసరమైన వసతులు కల్పించడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనార్టీ కాలనీలో ఏళ్లు గడుస్తున్న కేవలం ఒకే ఒక సీసీ రోడ్డు మాత్రమే అధికారులు ఏర్పాటు చేశారు. మిగతా కాలనీ అంత మట్టిరోడ్లే ఉన్నాయి. మునెప్ప నగర్‌ అక్కడక్కడ మాత్రమే అరకొర సీసీ రోడ్లు ఏర్పాటు చేసి వదిలేశారు. రాధాకృష్ణ కాలనీలోకి వెళ్లాలంటే మట్టిరోడ్డు గతి. కనీసం ఇక్కడ గరుసురోడ్డు కూడా లేకపోవటం దారుణం. ఇక గణేస్‌ కాలనీలోకి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు వేశారు. కాలనీలో సీసీరోడ్లు ఏర్పాటు చేయకపోవటంతో కాలనీ వాసులు ఇబ్బుందులకు గురువుతున్నారు. అలాగే మిలటరీ కాలనీ, సాయి నగర్‌, శివన్న నగర్‌, వైఎ్‌సఆర్‌ కాలనీల్లో మచ్చుకైనా సీసీ రోడ్లు కనిపించవు. ఎల్లమ్మ బీడుకాలనీలో మట్టిరోడ్లే దిక్కు. కబరస్తాన కొట్టాల, చంద్రయ్య కొట్టాల కాలనీల్లో ఎప్పుడో వేసిన రోడ్లు రాళ్లు తేలి ప్రజల రాకపోకలకు అసౌకర్యంగా మారింది. సీసీ రహదారులు అటుంచితే డ్రైనేజీలుసైతం నిర్మించకపోవటంతో ఇళ్లలోని మురుగునీరు ఇళ్లముందే ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు దుర్వాసనను భరించలేకపోతున్నారు. శివారు కాలనీల్లోని సాయినగర్‌, తిరుమల నగర్‌, గ్యాస్‌ గోడౌన వెనక ఉన్న కాలనీల ప్రజలకు తాగునీటి సరఫరా లేదు. సౌకర్యాలు కల్పించాలని అనేక సార్లు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే శివారు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:06 AM