జగన్‌ను చూస్తే జాలేస్తోంది!
ABN , Publish Date - Mar 12 , 2024 | 03:12 AM
: సీఎం జగన్‌ను చూస్తే తనకు జాలేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ఆయన ముఖంలో భయం...
ముఖంలో భయం, టెన్షన్: లోకేశ్
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుతో ఆయన పనైపోయింది
సిద్ధం సభలో డ్రోన్‌ను చూసి సింహం భయపడిందెందుకో
జనం రాకపోయినా గ్రాఫిక్స్ గిమ్మిక్.. ఈ సీఎంకు ప్రచార పిచ్చి
మరుగుదొడ్లపైనా స్టిక్కర్లే.. గ్రూప్-2 పేపర్‌లోనూ సొంత డబ్బా
బాబాయిని లేపేసిందెవరో అడగాల్సింది.. అమలు చేయని
హామీలపై ప్రశ్నలిస్తే పిల్లలు చక్కగా బదులిచ్చేవారు
లోకేశ్ విసుర్లు.. ఉమ్మడి అనంతలో ముగిసిన శంఖారావం
అనంతపురం మార్చి 11 (ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ను చూస్తే తనకు జాలేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. ఆయన ముఖంలో భయం... టెన్షన్ కనబడుతున్నాయని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదరడంతో ఆయన పనైపోయిందని అన్నారు. శంఖారావం కార్యక్రమంలో భాగంగా సోమవారం అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్, తాడిపత్రి నియోజకవర్గాల్లో నిర్వహించిన సభల్లో ఆయన ప్రసంగించారు. ‘సిద్ధం’ సభలకు జనం రాకపోయినా వచ్చినట్లు చూపించేందుకు గ్రీన్ మ్యాట్లు వేశారని, ఇదంతా గ్రాఫిక్ గిమ్మిక్కులో భాగమేనని తెలిపారు. ‘సభలో అరగంట అంబటి, బెట్టింగ్ స్టార్ అనిల్ నన్ను బండబూతులు తిట్టారు. వాళ్లకు ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నా.. సింహం, పులి అని చెప్పుకొనే మీ నాయకుడు ఎందుకయ్యా డ్రోన్‌ను చూసి పిల్లిలాగా భయపడ్డాడు..? అదిగో చూడండి.. డ్రోన్ ద్వారా ఖాళీ కుర్చీలు తీస్తున్నారంటూ జనం రాలేదని వాళ్లే అంగీకరించారు. ఇలాగుంది జగన్ పిల్లి పరిస్థితి’ అని ఎద్దేవాచేశారు. ఈ సీఎంకు ప్రచార పిచ్చి పట్టిందని, ఎక్కడ చూసినా ఆయన పోస్టర్లేనని అన్నారు. చివరకు మరుగుదొడ్ల గోడలపైనా జగన్ సిక్కర్లే కనిపిస్తున్నాయని చెప్పారు. గ్రూప్-2 పరీక్ష పేపర్‌లో జగన్ గురించి డబ్బా కొట్టుకోవడం చూస్తుంటే బిల్డప్ బాబాయ్ గుర్తుకొస్తున్నాడని అన్నారు. ఆ పరీక్షలో ఆడుదాం ఆంధ్రా, జీవక్రాంతి, చేదోడు గురించి కాదు ప్రశ్నలు అడగాల్సింది, బాబాయిని లేపేసింది ఎవరు..? వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని రద్దు చేయని సీఎం ఎవరు...? 30 లక్షల ఇళ్లు కట్టి మహిళల పేరుతో రిజిస్ర్టేషన్ చేయిస్తానని మాటిచ్చి తప్పిన సీఎం ఎవరు.. అనే ప్రశ్నలు వేసి ఉంటే 5 లక్షల మంది పిల్లలు సరైన సమాధానం చెప్పేవారని తెలిపారు. ప్రిజనరీ జగన్.. విజినరీ చంద్రబాబుకు మధ్య తేడా గుర్తించాలని ప్రజలను కోరారు. సూపర్ సిక్స్ పథకాలతో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని, అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని అన్నారు. ‘సైకో పోవాలి... సైకిల్ రావాలి..’ నినాదంతో సమష్టిగా ముందుకు కదలాలని పిలుపిచ్చారు. ఇంకా ఏమన్నారంటే..
ఏదీ హామీల అమలు?
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరం చేసిన ఆరు నెలలకు హామీలు అమలు చేస్తేనే ప్రజలపట్ల చిత్త శుద్ధి ఉన్నట్లు అని జగన్ గొప్పలు చెప్పాడు. చివరి ఆరు నెలల్లో చేస్తే మోసం అన్నాడు. అధికారంలోకి వచ్చి 58 నెలలు గడిచినా ఆయన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. 2.30 లక్షల పెండింగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది 6500 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చాడు గదా..? ఇస్తున్నాడా? ఎన్నికల ముంగిట గ్రూప్-2 నోటిఫికేషన్ ఇచ్చారు. అందులోనూ కేవలం 897 పోస్టులే చూపించారు. రెండు నెలలు ఓపిక పట్టండి. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రాగానే ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహిస్తాం. పెండింగ్‌లో ఉన్న పోస్టులను భర్తీ చేసే బాధ్యత నేను తీసుకుంటా.
స్టాన్‌ఫోర్డ్‌లో జగన్‌పై కేస్ స్టడీ
జగన్ వైట్ కాలర్ నేరస్థుడు. నేను చదువుకున్న స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోనూ జగన్ కేసులపై ఒక కేస్ స్టడీ ఉంది. జగన్ ఎక్కడకు వెళ్లినా ఏపీలో ఐపీఎల్ టీం పెడతానని చెబుతున్నాడు. ఆ టీఎంకు కోడి కత్తి వారియర్స్ టీమ్ అని పేరుపెడితే బాగుంటుంది. మంత్రి బొత్స ఏం చెబుతారో ఆయనకే అర్థం కాదు. ఎక్కువ మంది చదువుకోవడం వల్లనే ఉద్యోగాలు రావడం లేదంట. మరి నీకు మంత్రి పదవి ఎందుకు..? తప్పుకొని ఇంటికి వెళ్లు.. ఐదేళ్ల పాలనలో ఏ నాడూ మైనారిటీలపై దాడులు జరుగలేదు. జగన్ మాయ మాటలను మైనారిటీలు నమ్మొద్దు.
ఉమ్మడి అనంతలో ముగిసిన శంఖారావం
లోకేశ్ చేపట్టిన శంఖారావం మలివిడత సభలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారంతో ముగిశాయి. హిందూపురం నుంచి ప్రారంభమైన శంఖారావం.. మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గం, అనంతపురం అర్బన్, తాడిపత్రి నియోజకవర్గాల్లో సాగింది.
చరిత్ర ఉన్నంత వరకూ తాను ఉంటానని జగన్ చెబుతున్నాడు. చరిత్రలో మాటేమో గాని.. క్రిమినల్ రికార్డులు ఉన్నంతవరకు ఈ సైకో పేరు ఉండడం ఖాయం. చంచల్‌గూడ జైలు గోడలపై ఈయన పేరు ఉంటుంది.
టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పోరాడాలి. జనసేన పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ.. పసుపు సైనికుల పేరుతో జనసేన సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెడుతోంది. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి.
లోకేశ్