Share News

మాయాజూదం

ABN , Publish Date - Nov 17 , 2024 | 01:02 AM

‘‘ఒక వంద రూపాయలు మీది కాదనుకుంటే రూ.6,200 చేజిక్కించుకునే సువర్ణ అవకాశం మీదే. ఎన్నాళ్లు కష్టపడితే ఇంత డబ్బు చూడగల్గుతారు’’ అంటూ రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారి కూలీలు, ఏ పూట లాభంతో ఆ పూట కుటుంబాన్ని నడుపుకునే చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులే లక్ష్యంగా చేసుకుని వారి కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారు సింగిల్‌ నంబర్ల ఆట జూదగాళ్లు. నియోజకవర్గవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించిన వీరు రోజుకు రూ.4 లక్షలపైనే వసూళ్లకు పాల్పడుతున్నారు. దశాబ్దం కిందట ఆగిన ఈ జూదం వైసీపీ హయాంలో మళ్లీ పురుడు పోసుకుంది.

మాయాజూదం

- అవనిగడ్డ నియోజకవర్గంలో జోరుగా సింగిల్‌ నంబర్ల ఆట

- 100 రూపాయలకు రూ.6,200 అంటూ ఆశ పెడుతున్న బుకీలు

- రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే లక్ష్యంగా దందా!

- చల్లపల్లిలో మొదలై నియోజకవర్గవ్యాప్తంగా విస్తరణ

- దశాబ్దం కిందట ఆగిన ఈ జూదం వైసీపీ హయాంలో మళ్లీ పురుడు పోసుకుంది

‘‘ఒక వంద రూపాయలు మీది కాదనుకుంటే రూ.6,200 చేజిక్కించుకునే సువర్ణ అవకాశం మీదే. ఎన్నాళ్లు కష్టపడితే ఇంత డబ్బు చూడగల్గుతారు’’ అంటూ రెక్కాడితే గానీ డొక్కాడని రోజు వారి కూలీలు, ఏ పూట లాభంతో ఆ పూట కుటుంబాన్ని నడుపుకునే చిరు వ్యాపారులు, చేతి వృత్తిదారులే లక్ష్యంగా చేసుకుని వారి కష్టాన్ని నిలువునా దోచుకుంటున్నారు సింగిల్‌ నంబర్ల ఆట జూదగాళ్లు. నియోజకవర్గవ్యాప్తంగా తమ కార్యకలాపాలను విస్తరించిన వీరు రోజుకు రూ.4 లక్షలపైనే వసూళ్లకు పాల్పడుతున్నారు. దశాబ్దం కిందట ఆగిన ఈ జూదం వైసీపీ హయాంలో మళ్లీ పురుడు పోసుకుంది.

అవనిగడ్డ-ఆంధ్రజ్యోతి

చల్లపల్లి కేంద్రంగా రెండేళ్ల కిందట సింగిల్‌ నంబర్‌ జూదం ప్రారంభమైంది. మొదట్లో చల్లపల్లి, ఘంటసాల మండలాలకే ఈ జూదం పరిమితం కాగా, పోలీసుల నిఘా పెరగటంతో నిర్వాహకులు తమ జూదాన్ని మిగిలిన మండలాలకు కూడా విస్తరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 100 మందికి ఒకరు చొప్పున ప్రజల నుంచి రోజు వారీ బెట్టింగ్‌ మొత్తాన్ని కలెక్ట్‌ చేసి నిర్వాహకులకు అందజేస్తున్నారు. తాము కలెక్ట్‌ చేసిన మొత్తానికి పది శాతం కమీషన్‌ పొందుతున్నారు. ఎలాంటి కష్టం లేకుండా పది శాతం కమీషన్‌ చేతిలోకి వచ్చిపడుతుండటంతో గడిచిన కొద్ది నెలలుగా అవనిగడ్డ మండలంలోని పలు గ్రామాల్లో సైతం సింగిల్‌ నంబర్‌ జూదం జోరుగా సాగుతోంది. ఇప్పటికే అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ, పాత ఎడ్లంక, అవనిగడ్డ, సీతాయిలంక ప్రాంతాల్లో కొందరు బుకీలు ఈ జూదాన్ని ఇక్కడి వారికి అలవాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రోజుకు రూ.4 లక్షలకు పైగా కలెక్షన్‌

నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బుకీలు ఒక్కొక్కరూ రోజుకు రూ.4వేల నుంచి రూ.5 వేలకు తక్కువ కాకుండా వసూలు చేయడం ద్వారా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మేర బెట్టింగ్‌ మొత్తం సమకూరుతోంది. దీనిలో బుకీలకు కమీషన్‌ కిందే రోజుకు రూ.40 వేల నుంచి 50 వేల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. చల్లపల్లి మండలంలో పోలీసులు బెట్టింగ్‌ నిర్వాహకులపై బైండోవర్‌ కేసులు పెట్టడంతోపాటు గడిచిన కొద్ది రోజులుగా కఠినంగా వ్యవహరించటంతో వారు ఇతర ప్రాంతాలకు సింగిల్‌ నంబర్‌ లాటరీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

విష వలయంలోకి లాగుతున్నారు

గతంలో బుకీలు చార్ట్‌లు పట్టుకుని గ్రామాల్లో బెట్టింగ్‌ కాసిన వారి పేరు, వారు ఏ నంబర్‌పై కాసారో, ఎంత మొత్తం కాసారో వివరాలు నమోదు చేసుకునే వారు. అయితే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో బూకర్లు చార్టులు పక్కన పెట్టి సెల్‌ఫోన్‌ ద్వారానే బెట్టింగ్‌ రాకెట్‌ను నిర్వహించేస్తున్నారు. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వారి దగ్గరకు వెళ్లి వారి వద్ద నుంచి రూ.50 మొదలు రూ.1000 వరకు వారు ఎంత బెట్టింగ్‌ కాయదల్చుకున్నారో ఆ మొత్తాన్ని తీసుకుని వాట్సాప్‌లో వారి వివరాలను నిర్వాహకులకు పంపుతున్నారు. పది నుంచి 99 అంకెల నడుమ ఏదైనా ఒక నంబర్‌పై బెట్టింగ్‌ కాయిస్తున్నారు. బెట్టింగ్‌ కాసిన వారు గెలుపొందితే సాయంత్రానికే వారు బెట్టింగ్‌ కాసిన మొత్తానికి 62 రెట్ల మొత్తాన్ని ఇస్తూ పలువురిని ఈ విష వలయంలోకి లాగుతున్నారు.

ఆన్‌లైన్‌ లాటరీ యాప్‌ల్లో వచ్చే ఫలితాలే ప్రామాణికం

సింగిల్‌ నంబర్‌ జూదంలో పదవ అంకె నుంచి 99వ అంకె నడుమ ఏదైనా తమకు నచ్చిన అంకెపై బెట్టింగ్‌ కాస్తే ఆ రోజు సాయంత్రానికి ఆన్‌లైన్‌ లాటరీ యాప్‌ల్లో ప్రైజ్‌ తగిలిన 10 లేదా 14 నంబర్ల అంకెల్లో మొదటి, చివరి అంకెను గెలుపొందిన అంకెలా నిర్ణయిస్తారు. ఇందుకోసం ఏరోజుకారోజు ఆన్‌లైన్‌ లాటరీ యాప్‌ల్లో వచ్చే ఫలితాలను బెట్టింగ్‌ కాసే వారు పరిశీలిస్తుంటారు. తమ నంబర్‌కు లాటరీ తగిలిందో లేదో తెలుసుకునేందుకు తమ వద్ద ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లో ఈ యాప్‌లను డౌన్‌ లోడ్‌ చేసుకునే వారు కేవలం ఇది సింగిల్‌ నంబర్‌ ఆటకు మాత్రమే బెట్టింగ్‌ కట్టి ఆగకుండా యాప్‌లో కూడా జూదం ఆడుతూ ఇల్లు, ఒళ్లు గుళ్ల చేసుకుంటున్నారు.

అధికారుల తీరుపై విమర్శలు

సింగిల్‌ నంబర్‌ లాటరీ వ్యవహారంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చల్లపల్లికి చెందిన కొంతమంది నిర్వాహకులపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేయగా, వారి భాగస్వాములు సింగిల్‌ నంబర్‌ జూదం యథావిధిగా కొనసాగిస్తున్నారు. పోలీసులు హడావుడి చేసే రోజుల్లో సైలెంట్‌గా ఉంటూ ఆ తర్వాత మళ్లీ తమ వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. వివిధ స్థాయిల్లో అధికారులకు తమ వంతు సమర్పించుకుని తమ జోలికి రాకుండా చూసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం :

చల్లపల్లి కేంద్రంగా సింగిల్‌ నంబర్‌ లాటరీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ముగ్గురు నిర్వాహకులపైన, కొందరు బుకీలపైన బైండోవర్‌ కేసులను నమోదు చేశాం. వారిపై గట్టి నిఘా కొనసాగుతోంది. గడిచిన రెండు నెలల కాలంలో సింగిల్‌ నంబర్‌ లాటరీకి డబ్బు కట్టించుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. గ్రామాల్లో ఎవరైనా సింగిల్‌ నంబర్‌ లాటరీని ప్రోత్సహిస్తూ బెట్టింగ్‌ అమౌంట్‌ కలెక్ట్‌ చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి. నిందితులపై బైండోవర్‌ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం.

-ఈశ్వరరావు, సీఐ, చల్లపల్లి

Updated Date - Nov 17 , 2024 | 01:02 AM