మూడు వాహనాలపై మురిసిన మలయప్ప
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:06 AM
బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీవారికి మూడు వాహన సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం హనుమంత, సాయంత్రం స్వర్ణరథం,
స్వర్ణరథం, హనుమంత, గజ వాహనాలపై శ్రీవారి దర్శనం
తిరుమల, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శ్రీవారికి మూడు వాహన సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం హనుమంత, సాయంత్రం స్వర్ణరథం, రాత్రి గజవాహనంపై నాలుగుమాడవీధుల్లో మలయప్పస్వామి ఊరేగి భక్తులను కటాక్షించారు. ఉదయం పూజాదికాల తర్వాత రంగనాయకుల మండపంలో విశేష సమర్పణ చేశారు. అనంతరం ధనస్సు ధరించి తన భక్తుడైన హనుమంతుడిపై కోదండరాముడిగా మలయప్ప భక్తులకు దర్శనమిస్తూ మాడవీధుల్లో ఊరేగారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య స్వర్ణరథోత్సవం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంలో కొలువుదీరి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాత్రి 7 గంటలకు విశేష అలంకరణలో పట్టాభిషేకానికి వెళ్లే రారాజులా గజేంద్రుడిని వాహనంగా చేసుకుని ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులను కటాక్షిస్తారు.