Share News

మన మంచే మన బ్రాండ్‌!

ABN , Publish Date - Jul 23 , 2024 | 03:20 AM

కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి ఒక్కటే మన బ్రాండ్‌గా ప్రజల హృదయాల్లో నిలవాలి.

మన మంచే మన బ్రాండ్‌!

దానిని అందరూ కాపాడండి.. గెలిపించిన ప్రజల ఆకాంక్షలేమిటో తెలుసుకోండి

ఇసుకలో రాజకీయ జోక్యం వద్దు.. ప్రతీకార రాజకీయాలు వద్దే వద్దు

కూటమి ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితవు

జగన్‌ ఇంకా సీఎం అనుకుంటున్నారు

సభలో తీరు అభ్యంతరకరం: పవన్‌

నామినేటెడ్‌ పదవుల్లో మిత్రపక్షాలకూ

అవకాశం ఇవ్వాలి: నాదెండ్ల మనోహర్‌

‘వరద’ సాయం పెంచాలి: ఎమ్మెల్యేలు

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ‘‘కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి ఒక్కటే మన బ్రాండ్‌గా ప్రజల హృదయాల్లో నిలవాలి. రాజకీయ ప్రతీకారాలు, కక్ష సాధింపులు, దాడులు మనం చేస్తున్న మంచిని కప్పివేయకుండా చూసుకోండి’’ అని సీఎం చంద్రబాబు కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం మధ్యాహ్నం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘సామాజిక పింఛన్‌ను మొదటి నెలలోనే రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు చేశాం. గత 3 నెలల బకాయిలు కలిపి ఒకేసారి రూ.ఏడు వేలిచ్చాం. దివ్యాంగుల పింఛను పెంచాం. ఉచిత ఇసుక తెచ్చి దోపిడీ లేకుండా చేశాం. మన నిర్ణయాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇవి పక్కకు వెళ్లి.. వేరే విషయాలు వారి ముందుకు రాకుండా చూసుకోవాలి’’ అని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలని, రాజకీయ ప్రతీకారాల జోలికి వెళ్లవద్దని తేల్చి చెప్పారు. ఇసుక వ్యవహారాల్లో ఎవరూ తలదూర్చవద్దన్నారు.

జగన్‌ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

జగన్‌ తీరు మారలేదని, రాష్ట్రంపై బురద చల్లడానికి వెనకాడటం లేదని చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘‘వినుకొండలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల మధ్య చాలాకాలంగా తగాదాలు ఉన్నాయి. వారిలో ఒకరు మరొకరిని హత్య చేశారు. జగన్‌ దానికి రాజకీయ రంగు పులమాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్యను టీడీపీ నేతల మీద రుద్దడానికి ఇదే తరహా ప్రయత్నం చేశారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నా ఘోరాలు జరిగిపోతున్నాయని, వందల హత్యలు జరుగుతున్నాయని బురద చల్లాలని చూస్తున్నారు. ఆయన హయాంలో అరాచకాలతో పెట్టుబడులు రాలేదు. ఇప్పుడు కూడా అప్రతిష్ఠ తెచ్చి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఈ కుట్రలపై చర్చ పెట్టాలి’’ అని పిలుపునిచ్చారు.

వ్యవస్థ నాశనానికి ఇదే ఉదాహరణ

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి ఫైళ్లు దగ్ధమైన ఘటనను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ‘‘రాత్రి 11.20కి జరిగింది. ప్రభుత్వ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరిగితే వెంటనే మంటలు ఆర్పాలి. డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించి అనుమానితుల కోసం గాలించాలి. కానీ జరగలేదు. అధికారులు చాలా ఉదాశీనంగా స్పందించారు. గత ఐదేళ్లలో అధికార వ్యవస్ధను ఎంత నాశనం చేశారో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అందుకే దర్యాప్తునకు సీనియర్‌ అధికారులను పంపాను’’ అనిచెప్పారు.


అందరికీ అవకాశాలు ఇవ్వండి: మనోహర్‌

మూడు భాగస్వామ్య పక్షాల మధ్య రాజకీయ మైత్రి మరింత బలపడటానికి నామినేటెడ్‌ పదవుల్లో అందరికీ భాగస్వామ్యం కల్పించాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజ్ఞప్తి చేశారు. దానికి ఇబ్బందేమీ లేదని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మిత్రపక్షాల వారి పేర్లు కూడా ఇవ్వాలని చంద్రబాబు చెప్పారు. వరదల కారణంగా నాట్లు వేసిన రైతులు చాలా నష్టపోయారని, వారికి తాత్కాలిక సాయం ఎకరానికి రూ.వెయ్యి చొప్పున కాకుండా ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.ఆరు వేలు ఇవ్వాలని నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. వరదలపై ప్రస్తుత సమావేశాల్లో అరగంట చర్చ కూడా నిర్వహిద్దామన్నారు. ఇసుక సమస్యలను ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ప్రజల అవసరాలకు చాలినంత ఇసుక లభ్యం కావడం లేదని, దీంతో రేట్లు తగ్గడం లేదని ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, శ్రీనివాసరావు తదితరులు చెప్పారు. లోడింగ్‌, రవాణా చార్జీలు గోదావరి జిల్లాల్లో అధికంగా ఉన్నాయని, తూర్పు కలెక్టర్‌ తమ వద్ద ఉన్న ఇసుకను పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లనీయడం లేదని మరో ఎమ్మెల్యే చెప్పారు. వరదల సీజన్‌లో ఈ ఇబ్బంది ఉంటుందని, తర్వాత రేవులన్నీ తెరిస్తే ఇసుక లభ్యత పెరిగి ధరలు తగ్గుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఆర్థిక సమస్య చాలా తీవ్రంగా ఉంది. కేంద్రం నుంచి కొంత ఆదుకోవాలని కోరాం. ఖజానా పూర్తిగా ఖాళీగా ఉంది. కానీ అత్యవసరమైన పనులు ఆపలేం. రోడ్ల పరిస్థితి ఘోరంగా ఉంది. ముందు వాటిని బాగుచేయాలి. వాటి మరమ్మతులకు రూ.250 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం. చాలకపోతే మరో రూ.500 కోట్లయినా ఇస్తాం’ అని వివరించారు. ఢిల్లీలో జగన్‌ ఎన్ని విన్యాసాలు చేసినా అతనిని పట్టించుకొనే పరిస్ధితి లేదని బీజేపీ నేత, మంత్రి సత్యకుమార్‌ అన్నారు.

జగన్‌కు తత్వం బోధపడలేదు: పవన్‌

అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన సమయంలో వైసీపీ సభ్యుల తీరు అసహ్యం కలిగిస్తోందని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ‘‘జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదు. నెల రోజుల్లోనే ప్రభుత్వంపై యుద్ధం చేయాలని అనుకుంటున్నారు. సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ, సభ లోపల గవర్నర్‌ ప్రసంగానికి అడ్డుపడమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం ఆయన అహంకారానికి నిదర్శనం. ఎల్లకాలం తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్న భ్రమ నుంచి ప్రజలు బయట పడేసినా ఆయన ఇంకా ఆ భ్రమలోనే ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన ప్రకటించారు.

జగన్‌ కుట్రల వల్ల నేను 53 రోజులు జైల్లో ఉన్నాను. ఈ అవమానానికి ప్రతీకారం అందరి కంటే ముందు నేనే తీర్చుకోవాలి. కానీ వద్దనుకున్నాను. కక్షలు, కార్పణ్యాలే పనిగా పెట్టుకుంటే నష్టపోతాం. ప్రజలు మనల్ని గెలిపించింది కక్షలు తీర్చుకునేందుకు కాదు.

- చంద్రబాబు

Updated Date - Jul 23 , 2024 | 03:20 AM