నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్కులకు స్థలాలు
ABN , Publish Date - Oct 06 , 2024 | 04:16 AM
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మైక్రో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు స్థలాలు కేటాయించి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు చెప్పారు.
ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ మైక్రో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు స్థలాలు కేటాయించి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధిని పక్కనబెడితే.. ఉన్న పరిశ్రమలు కూడా రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మళ్లీ పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించి రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన ఆయన ఇటీవల ఏపీఐఐసీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. శనివారం ఉదయం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్‌లో పూజలు నిర్వహించి.. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంతెన రామరాజుకు మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, డోలా బాలవీరాంజనేయస్వామి, బీసీ జనార్దనరెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు, మాజీమంత్రి పీతల సుజాత, పలువురు టీడీపీ నాయకులు నాయకులు పూలమాలలు, శాలువాలు కల్పి అభినందనలు తెలిపారు. ఏపీఐఐసీ వీసీ, ఎండీ అభిషిక్త్ కిశోర్, అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు.