Share News

కొట్టి.. ఒంటికి రంగుపూసి.. బాలలతో భిక్షాటన

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:25 AM

వారంతా బడి ఈడు చిన్నారులు. కానీ, కర్నూలు నగరంలో భిక్షాటన చేస్తున్నారు. ఒంటికి వెండి రంగు పూసుకుని యాచన చేస్తున్నారు.

కొట్టి.. ఒంటికి రంగుపూసి.. బాలలతో భిక్షాటన

కర్నూలులో ఓ ముఠా దారుణకాండ

పిల్లల భిక్షాటన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

స్పందించిన మంత్రి నారా లోకేశ్‌.. రక్షిస్తామని భరోసా

కర్నూలు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వారంతా బడి ఈడు చిన్నారులు. కానీ, కర్నూలు నగరంలో భిక్షాటన చేస్తున్నారు. ఒంటికి వెండి రంగు పూసుకుని యాచన చేస్తున్నారు. నిజానికి వారు ఇష్టంతో చేస్తున్న పనికాదు. వీరి వెనుక ఓ ముఠా ఉంది. పిల్లల్ని కొట్టి ఈ పనికి పురుగొల్పుతోంది. స్థా నిక డ్రస్‌ సర్కిల్‌లో ఓ బాలుడికి ఒంటి నిండా సిల్వర్‌ రంగు పూసి తీవ్రంగా కొట్టి భిక్షాటన చేయిస్తున్న దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ బాలుడితో పాటు మరో ముగ్గురు కూడా భిక్షాటన చేయడం వెనుక ఓ ముఠానే ఉందని పేర్కొన్నారు. ఇది వైరల్‌ అయింది.

హృదయ విదారకం: లోకేశ్‌

పిల్లల భిక్షాటన వీడియో చూసిన మంత్రి నారా లోకేశ్‌.. ఇది హృదయ విదారక సంఘటనగా పేర్కొన్నారు. ప్రతి బిడ్డ భద్రత, ప్రేమానురాగాలు, సమాజంలో గౌరవం పొందడానికి అర్హుడు. ఆ చిన్నారిని గుర్తించి అవసరమైన రక్షణ, సంరక్షణ చర్యలు చేపడతాం. చిన్నారిపై దౌర్జన్యానికి పాల్పడిన వారి పై తగిన చర్యలు తీసుకుంటామని ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై చిన్నారి వీడియో పోస్టు చేసిన సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ సంతో్‌షకుమార్‌ ప్రతిస్పందిస్తూ.. మంత్రి లోకేశ్‌ స్పందించడం ఆనందంగా ఉందన్నారు. కాగా, కర్నూలులో రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌, రాజ్‌ విహార్‌ సర్కిల్‌, కలెక్టరేట్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌, డ్రస్‌ సర్కిల్‌, పాత బస్టాండ్‌ ప్రాంతాల్లో చిన్నారులతో ముఠా భిక్షాటన చేయిస్తోంది. ఆ చిన్నారులకు సరైన ఆహారం కూడా పెట్టకుండా గంజాయి, వైట్‌నర్‌ మత్తుకు బానిసలను చేస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ జిల్లా స్థాయి యంత్రాంగం చూస్తూ కూడా ఈ తతంగాన్ని పట్టించుకోవడంలేదు. మంత్రి లోకేశ్‌ ఆదేశాలతోనైనా జిల్లా కలెక్టరు, ఎస్పీ తక్షణం స్పందించి వారిని బాలల సదన్‌కు తరలించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Nov 21 , 2024 | 04:25 AM