Nimmala Ramanaidu: రాయలసీమ ద్రోహి జగన్
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:16 AM
జగన్ రాయలసీమ ద్రోహి అని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
వైసీపీ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు నిర్వీర్యం: మంత్రి నిమ్మల
కొండాపురం/కడప (ఎన్టీఆర్ సర్కిల్), డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జగన్ రాయలసీమ ద్రోహి అని, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీసం ప్రాజెక్టుల గేట్లు కూడా మరమ్మతులకు నోచుకోలేదని, రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ సీమ ప్రాంతాన్ని మోసం చేశారని విమర్శించారు. ఆదివారం కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోదావరి-పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని, రతనాల సీమగా తీర్చిదిద్దుతామని అన్నారు. 2025 జూలై చివరికల్లా హంద్రీ-నీవా పనులు పూర్తి చేసి చివరి ఎకరం వరకు నీరందిస్తామని తెలిపారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్.. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు గత ఐదేళ్లలో రూ.450 కోట్లు పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు.
టీడీపీతోనే బలిజల అభివృద్ధి: మంత్రి
రాష్ట్రంలో బలిజల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమైందని మంత్రి రామానాయుడు అన్నారు. కడపలో బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన బలిజ కాపు ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ ప్రాంత బలిజల అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, నిర్వాహకులు బి.హరిప్రసాద్, బి.శ్రీనివాసులు, బి.నాగరాజు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.