AP News: అన్న క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నిమ్మల రామానాయుడు
ABN , Publish Date - Aug 16 , 2024 | 07:49 AM
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.
పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు. పేదల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లను ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు మించి జగన్ అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనవంతులు మాదిరిగా పేదవాడి కడుపు నింపేందుకు రుచి శుచిగా అన్ని వసతులతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుంటే జగన్ ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అన్నారు.
అన్ని వసతులతో అన్న క్యాంటీన్ భవనం అవసరం లేదని, కాకా హోటల్ సరిపోతుందని చెప్పిన జగన్ మరోసారి తన పెత్తందారితనం బయటపెట్టాడని విమర్శించారు. పాలకొల్లులో అన్న క్యాంటీన్‌ను మూసివేసిన రోజు నుంచి ఇప్పటివరకు ఐదేళ్లు దాతల సహకారంతో నిర్వహిస్తూ పేదల ఆకలి బాధ తీరుస్తున్నామని అన్నారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న ఉచిత భోజనాలు యథావిథిగా కొనసాగుతాయని మంత్రి రామానాయుడు స్పష్టంగా చెప్పారు.
విరాళాల వెల్లువ..
ఆంధ్రప్రదేశ్‌లో పునఃప్రారంభమైన ‘అన్న క్యాంటీన్’లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు రూ.5 లకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు. బుధవారం ఒక్క రోజే రూ.2 కోట్లకుపైగా విరాళాలు అందాయి. వివిధ వర్గాల ప్రజలు, సంస్థలు విరాళాలిచ్చేందుకు ఆసక్తి చూపుతుండటంతో అన్న క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న మున్సిపల్‌శాఖ విరాళాలు తీసుకునేందుకు బ్యాంక్ ఖాతా వివరాలను ప్రకటించింది. విరాళాలు పంపించాలనుకునేవారు ఆ ఖాతాకు నేరుగా ఆన్‌లైన్ విధానంలో లేదా చెక్ రాసి పంపవచ్చని తెలిపింది. అన్న క్యాంటీన్స్, అకౌంట్ నెంబరు 37818165097కు గుంటూరు చంద్రమౌళినగర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌కు చెందేలా జమచేయవచ్చని పేర్కొంది.