అరటితో అద్భుతాలు
ABN , Publish Date - Nov 12 , 2024 | 11:58 PM
ఆయన చదివింది సివిల్ ఇంజనీర్.. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ రైతుబిడ్డగా మారిపోయారు. వ్యవసాయంపై ఇష్టంతో ఆ రంగాన్ని ఎంచుకున్నారు.
కొట్టేసిన మొద్దులతో నారా, జ్యూస్ తయారీ
ఫ కాయలతో పొడి ఉప ఉత్పత్తులు
ఫ తోటల సాగులో స్ఫూర్తిగా సివిల్ ఇంజనీర్
ఫ జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు
ఫ రైతు శ్రేయోభిలాషిగా పరదేశీ మహేష్
డోన, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆయన చదివింది సివిల్ ఇంజనీర్.. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ రైతుబిడ్డగా మారిపోయారు. వ్యవసాయంపై ఇష్టంతో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. అరటి సాగులో భళా అనిపిస్తున్నారు. సెమీ ఆర్గానిక్ ఎరువులతో అరటి తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అరటిపై పరిశోధన చేస్తూనే వినూత్న ఆలోచనలతో ఉప ఉత్పత్తులు సాధిస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు. ఎంతో మంది రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
డోన పట్టణానికి చెందిన సివిల్ ఇంజనీర్ పరదేశీ మహేష్ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ డోన నియోజకవర్గ ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. పట్టణంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న పరదేశీ మహేష్ 2000 సంవత్సరంలోనే సివిల్ ఇంజనీర్ పూర్తి చేశాడు. ఇంజనీర్‌గా ఉద్యోగం చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి చిన్నప్పటి నుంచే వ్యవసాయంపై మక్కువతో మహేష్ అందులో అడుగు పెట్టారు. మొదట డోన సమీపంలో తన పొలంలో కూరగాయలను సాగు చేశారు. ఆ తర్వాత రుద్రవరం మండలంలోని అలుమూరు గ్రామంలో రైతుల నుంచి పొలం కౌలుకు తీసుకుని పసుపు, వేరుశనగ, మిర్చి తదితర పంటలను సాగు చేశారు. ఆ తర్వాత క్రిష్ణగిరి మండలంలోని కోయిలకొండలో అల్లం, కందితో పాటు అరటి, బొప్పాయి, కలింగడ పండ్ల తోటలను సాగు చేశారు. సేంద్రియ ఎరువులతో తక్కువ పెట్టుబడులతో ఎక్కువ దిగుబడులు సాధించారు. ఆ తర్వాత డోన ప్రాంతంలోని కొచ్చెర్వు, మెట్టుపల్లి, జలదుర్గం గ్రామాల్లో రైతుల భాగస్వామ్యంతో అరటి, బొప్పాయి పండ్ల తోటలను సాగు చేశారు. వెల్దుర్తి మండలంలోని బోయినపల్లెలో ఎనిమిది ఎకరాల్లో అరటి తోటను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం సెమీ ఆర్గానిక్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు.
ఫ అరటి మొద్దులతో ఉప ఉత్పత్తులు:
ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో పరదేశీ మహేష్ అరటి తోటలపై పరిశోధన చేస్తున్నారు. అరటి తోటల్లో చెట్లను కొట్టేసి, మిగిలిన అరటి మొద్దులతో ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసి తీసుకున్న అరటి మొద్దుల ద్వారా అరటి నారాను బయటకు తీస్తున్నారు. ఈ నార ఉత్పత్తులను బట్టల తయారీ కంపెనీలకు మార్కెటింగ్ చేస్తున్నారు. అరటి మొద్దుల మధ్యలో ఉండే సెంటర్ పోర్ స్టెమ్ నుంచి జ్యూస్‌ను బయటకు తీస్తున్నారు. ఈ జ్యూస్‌ను కిడ్నీలో రాళ్లను కరిగించే మెడిసిన్సకు వినియోగిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. అంతేగాక అరటి మొద్దుల వేస్టేజీని కంపోస్టుగా మార్చి సేంద్రియ ఎరువుగా వినియోగిస్తున్నారు. అదేవిధంగా అరటి కాయలతో పొడి చేసి వాటి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నారు. పిల్లలకు తినిపించే సెరిలాక్ పౌష్టికాహారంలో ఈ పొడిన వినియోగిస్తున్నారు. ఇలా అరటి మొద్దులు, కాయల నుంచి ఉప ఉత్పత్తులు సాధిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సహకారంతో అరటి తోటల నుంచి సాధిస్తున్న ఉప ఉత్పత్తులతో మరిన్ని అరటి పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పరదేశి మహేష్ ప్రణాళికలు రూపొందించుకున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి అరటి ఉప ఉత్పత్తుల పరిశ్రమల గురించి వివరించనున్నట్లు పరదేశీ మహేష్ తెలిపారు.
ఫ జాతీయ స్థాయిలో ఉత్తమ అరటి రైతు అవార్డు:
డోన ప్రాంతంలో అరటి తోటల సాగులో ప్రత్యేక గుర్తింపు పొందిన పరదేశి మహేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ అరటి రైతు అవార్డు పొందారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి అరటిపై పరదేశి మహేష్ పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నేషనల్ రీసెర్చ్ పార్క్ బనానా సంస్థ ఏడు రాష్ట్రాల నుంచి 20 మందిని ఎంపిక చేసింది. అందులో మహేష్ జాతీయ స్థాయిలో ఉత్తమ అరటి రైతుతో పాటు ఎంటర్ ట్రైనర్ అవార్డుకు ఎంపికయ్యారు. మూడు నెలల క్రితం తమిళనాడులోని తిరుచురాపల్లిలో జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమంలో అరటి ఉత్తమ రైతు అవార్డును మహేష్ అందుకున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అరటి జాతీయ పరిశోధన సంస్థ నుంచి ఇచ్చే రూ.5 లక్షల ప్రోత్సాహక రివార్డుకు మహేష్ ఎంపికయ్యారు. ఇలా అరటి తోటల సాగులో పరదేశీ మహేష్ మంచి ఫలితాలు సాధిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
ఫ రైతు శ్రేయోభిలాషిగా:
డోన నియోజకవర్గ ప్రాంతంలో పరదేశి మహేష్ రైతు శ్రేయోభిలాషిగా గుర్తింపు పొందారు. పొలాల దగ్గరకు నేరుగా వెళ్లి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన కల్పిస్తున్నారు. తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు ఎలా సాధించాలన్న దానిపై రైతులకు వివరిస్తున్నారు. డోన నియోజకవర్గ ప్రాంతంలో ఉద్యాన పంటలను ఎక్కువగా సాగు చేసేందుకు కృషి చేస్తున్నారు. కరోనా సమయంలోనూ రైతుల నుంచి పండ్లు, కూరగాయలను కొనుగోలు చేసి రూ.100కే ఐదు రకాల పండ్లను, కూరగాయలు పంపిణీ చేశారు. పోలీసు, పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు ఉచితంగా పండ్లు, కూరగాయల కిట్లను అందజేశారు. గత పాతికేళ్లుగా పరదేశి మహేష్ రైతులకు తన వంతు సేవలు అందిస్తూ రైతు బిడ్డగా పేరు సంపాదించుకున్నారు.
ఫ అరటి పరిశ్రమలు తీసుకురావాలన్నదే లక్ష్యం - పరదేశి మహేష్:
డోన ప్రాంతంలో అరటి పరిశ్రమలు తీసుకు రావాలన్నదే తన లక్ష్యం. ఎన్నికల ప్రచార సమయంలో డోనకు చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ద్వారా అరటి తోటల పరిశోధన గురించి వివరించాను. అరటి ద్వారా ఉప ఉత్పత్తులు సాధిస్తున్న అంశాలపై తెలియజేశాను. ఈ ప్రాంత రైతులకు అరటి పరిశ్రమలు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. అరటి ఉప ఉత్పత్తులతో వందల మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది.