వైసీపీకి.. జయమంగళం
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:28 AM
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో ఉన్న ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఎమ్మెల్సీ, పార్టీ పదవులకు వెంకటరమణ రాజీనామా
చాన్నాళ్లుగా పార్టీకి దూరం.. అయినా పట్టించుకోని అధి నాయకత్వం
అప్పుడు టీడీపీ.. ఇప్పుడు జనసేన గేలం
ఏలూరు జిల్లాలో వైసీపీకి షాక్ మీద షాక్
ఈ స్థానం ఎవరికి దక్కేను ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో ఉన్న ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే ఏలూరు జిల్లాలో వైసీపీ పూర్తిగా దిగజారిన పరిస్థితుల్లో వెంకటరమణ తన పదవికి రాజీనామా చేయడం వైసీపీకి ఒక బిగ్ షాక్.
చాలా కాలం నుంచి వెంకటరమణ పార్టీని వీడబోతు న్నారంటూ ప్రచారం సాగుతుండగా దీనికి బ్రేక్ వేసేందు కు వైసీపీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. అర్ధంత రంగా జయమంగళ తన పదవిని వదులుకోలేదు. దీని వెనుక రకరకాల కోణాలున్నాయి. ఇప్పటికే వైసీపీ తన పార్టీ కేడర్‌కు దూరంగా మిగిలింది. కొద్ది మాసాల క్రితం జయమంగళతో టీడీపీ నేతలు కొందరు టచ్‌లోకి వెళ్ళారు. వైసీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆయన చెవిన వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ ఆ తర్వాత జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు ఎక్కడా వేగిరపర్చలేదు. ఆ పార్టీ ఎమ్మెల్సీగా వున్న వెంకటరమణ పార్టీ అగ్రనాయక త్వంతోపాటు మిగతా సీనియర్లతోను మాటామంతీ లేకుండా దూరంగా ఉన్నారు. ఆయనను ఒప్పించి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలనే ప్రయత్నం వైసీపీలో ఒక్కరూ చేయలేదు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి ఆళ్ల నాని నాలుగు నెలల క్రితం పార్టీకి, తన పదవులకు రాజీనామా చేసి మాయమయ్యారు. ఇదే సందర్భంలో జిల్లా అధ్యక్ష స్థానానికి కైకలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పేరు నాయకత్వం ప్రతిపాదించి ఆ మేరకు ఒప్పించింది. ఇంత జరిగినా అదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ వెంకటరమణ విషయంలో చూసీచూడ నట్టు వ్యవహరించింది.
రమణ వెనుక ప్రకాశం నేత
వెంకటరమణ రాజీనామా చేయడానికి ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన నేత కీలక పాత్ర పోషించి నట్టు చెబుతున్నారు. గతంలో వెంకటరమణతో టీడీపీ నేతలు చర్చించినట్టే జనసేన నేత పక్షం రోజులకు ముందే చర్చలు సాగించారు. తమ పార్టీలో చేర్చుకోవ డమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినం దుకు సంతృప్తి కలిగించేలా తాను సాయపడతానంటూ భరోసా ఇచ్చిన తదుపరే రాజీనామాల పర్వం సాగినట్టు చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో కైకలూరు నియోజకవర్గ టీడీపీ కన్వీనర్‌గా ఉన్న వెంకట రమణ ఆ తదుపరి వైసీపీలో చేరారు. కొల్లేరులో ఒక బలమైన సామాజికవర్గం బీసీ ప్రతినిధిగా రమణకు వైసీపీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. ఒకవైపు టీడీపీని దెబ్బతీయడమే కాకుండా సమాంతరంగా కొల్లేరులో రమణ సామాజిక వర్గం వారి మద్దతు దక్కుతుందన్న వ్యూహంతో వైసీపీ వ్యవహరించింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లే ముందు వెంకటరమణను అప్పట్లో టీడీపీ పెద్దలు ఎవరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసే సందర్భంలోను వైసీపీ పక్షాన సీనియర్లు ఎవరూ చర్చలకు రాలేదు. దీంతో వెంకటరమణ కొంత అసంతృప్తి చెందడమే కాకుండా జనసేన నేత ఇచ్చిన ‘హామీ’తోనే కాస్త మెత్తపడ్డట్టు సమాచారం. రాబోయే కొద్ది రోజుల్లోనే జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ సమక్షంలోనే వెంకటరమణ ఆ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది.
సీను మారింది
ఎమ్మెల్సీగా వెంకటరమణ కొద్ది మాసాలే కొనసాగారు. ఈ స్వల్ప కాలంలో ఆయనను టార్గెట్ చేసుకుని అన్ని పార్టీలు వ్యవహరించాయి. అసెంబ్లీ ఎన్నికల సమయం లో జనసేన కోసం పార్టీ టిక్కెట్లను త్యాగం చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ వలవల బాబ్జీకి న్యాయం చేస్తామంటూ అప్పట్లోనే చంద్రబాబు భరోసా ఇచ్చారు. దీనికి తగ్గట్టు ఒక వేళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పుకుంటే ఆ ఖాళీని గన్నితో భర్తీ చేయవచ్చన్న కోణంలోనే తొలుత టీడీపీ నాయకులు ఆయనతో సంప్ర దింపులు జరిపారు. ఈ విషయం లీక్ కావడంతో కొన్నా ళ్ళపాటు ఈ తరహా సంభాషణలకు బ్రేక్ పడింది. కైకలూరులో స్థానికంగా ఉన్న కొందరు.. ఏం చేద్దాం ఆ విషయం అంటూ పార్టీ సీనియర్లను సంప్రదించినా వ్యవహారం ముందుకు సాగలేదు. ఇదంతా గడిచి నెల న్నర రోజులైంది. ఇప్పుడు మరోమారు జనసేన ఆయన చుట్టూనే వ్యూహం నడిపింది. చివరికి అది ఫలించి రమణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి దారితీసింది.
ఇప్పుడు ఖాళీ అయిన ఆ స్థానంలో ప్రకా శం జిల్లాకు చెందిన జనసేన నేతతో భర్తీ చేయడానికేనంటూ విస్తృత ప్రచారం సాగుతోంది. పార్టీ కోసం టికెట్ త్యాగం చేసిన గన్ని, వలవల విషయంలో మరెప్పుడు న్యాయం జరుగు తుందో తెలియడం లేదనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. జనసేన కొంత దూకుడుగా వెళ్లడం, ఆ పార్టీలోవున్న ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఏదొక రకంగా సమయం చిక్కినప్పుడల్లా న్యాయం జరుగుతోందని, అదే తెలుగు దేశం పార్టీ విషయానికి వచ్చేసరికి అత్యధికులకు అలాంటి పరిస్థితి లేదనే అసంతృప్తి స్పష్టంగా ఉంది.