Share News

బాపట్ల ఎంపీ సీటుకు ఎమ్మెస్‌ రాజు ఖరారు

ABN , Publish Date - Mar 19 , 2024 | 03:13 AM

బాపట్ల (ఎస్సీ) లోక్‌సభ సీటుకు పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. సోమవారం ఇక్కడ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం జరిగినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ పార్లమెంటు సీటుకు

బాపట్ల ఎంపీ సీటుకు ఎమ్మెస్‌ రాజు ఖరారు

పెనమలూరుకు పరిశీలనలో ఆలపాటి రాజా?

చీపురుపల్లిలో బొత్సపై పోటీకి గంటానే...

అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): బాపట్ల (ఎస్సీ) లోక్‌సభ సీటుకు పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఎంఎస్‌ రాజు పేరును తెలుగుదేశం పార్టీ ఖరారు చేసింది. సోమవారం ఇక్కడ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం జరిగినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీలకు రిజర్వు అయిన ఈ పార్లమెంటు సీటుకు మాదిగ ఉప కులానికి చెందిన మంచి అభ్యర్థి కోసం ఆ పార్టీ కొంత కాలంగా అన్వేషిస్తోంది. పార్టీ దళిత విభాగానికి అధ్యక్షుడిగా ఉండి బాగా పనిచేసినందుకు గుర్తింపుగా రాజుకు ఈ సీటును ఇస్తే బాగుంటుందని సమావేశంలో పార్టీ నేతలు అభిప్రాయపడినట్లు సమాచారం. రాజు స్వస్థలం అనంతపురం జిల్లా. కాగా, పెనమలూరు సీటుకు తాజాగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ పేరు పరిశీలనకు వచ్చినట్లు సమాచారం. రాజేంద్రప్రసాద్‌ గతంలో గుంటూరు జిల్లా తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహించారు. కూటమి సీట్ల సర్దుబాటులో ఈ సీటు జనసేన పార్టీలో ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించారు. దీనితో రాజా పేరును ఈ సీటుకు పరిశీలిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లో వినవస్తోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరును విజయనగరం జిల్లా చీపురుపల్లికి ఎంపిక చేసినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట చంద్రబాబును గంటా కలిసి మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గంటా హామీ ఇచ్చినట్లు సమాచారం. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నేతలు పెద్ద సంఖ్యలో సోమవారం ఇక్కడ చంద్రబాబును కలిశారు. తమ వర్గానికి అనంతపురం జిల్లా పుట్టపర్తి సీటు కేటాయించాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. పరిశీలిస్తానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.

Updated Date - Mar 19 , 2024 | 03:13 AM