అప్పు తీర్చమంటే... ఎంపీ అవినాశ్‌రెడ్డి పేరు చెప్పి బెదిరిస్తున్నారు
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:16 AM
‘మా వద్ద అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించమంటే ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మధు పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు’ అని ఒక మహిళ, మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి మండలం
లోకేశ్ ప్రజాదర్బార్‌లో మొరపెట్టుకున్న మహిళ
నా భర్తను సౌదీలో అక్రమంగా నిర్బంధించారు విడిపించి, స్వదేశానికి రప్పించండి... ఓ మహిళ వేడుకోలు
తాడేపల్లి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ‘మా వద్ద అప్పు తీసుకున్నారు. తిరిగి చెల్లించమంటే ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మధు పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు’ అని ఒక మహిళ, మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం ప్రజాదర్బార్ జరిగింది. ఈ సందర్భంగా ప్రజా దర్బార్‌కు వచ్చిన సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన ిసీ అమ్మాజీ, మంత్రి లోకేశ్‌తో మాట్లాడుతూ, ‘పులివెందులకు చెందిన షేక్ సాయి అనే వ్యక్తి దశల వారీగా రూ.40 లక్షల వరకు అప్పు తీసుకున్నారు. డబ్బు చెల్లించమని అడిగితే ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మధు పేర్లు చెప్తున్నారు. వారి అనుచరులమంటూ బెదిరిస్తున్నారు. డబ్బులు ఇప్పించి, వారి నుంచి రక్షణ కల్పించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో పేద రైతుకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి, వైసీపీ నేత ఆదిమూలపు సురేశ్, అతని సోదరుడు ఆదిమూలపు సతీశ్ ఇంజనీరింగ్ కాలేజి నిర్మించారని, విచారించి న్యాయం చేయాలని దర్శికి చెందిన బి వెంకట రామాంజులరెడ్డి, కేసరి రంగలక్ష్మమ్మ లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. 2003లో ఆదిమూలపు సురేశ్ తండ్రి దివంగత ఆదిమూలపు శామ్యూల్ జార్జి సర్వే నం.841/1లో ఆరుగురు పేద రైతులకు చెందిన భూములను తప్పుడు ప్రతాలతో రిజిష్టరు చేయించుకున్నారు. అనంతరం ఆ భూముల్లో డాక్టర్ శామ్యూల్ జార్జి ఇంజనీరింగ్ కాలేజి నిర్మించారు. సదరు భూముల కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ఏ అధికారి ఇంతవరకూ స్పందించ లేదు. భూములు ఇప్పించండి’ అని కోరారు. సౌదీ అరేబియాలో అక్రమ నిర్బంధానికి గురైన తన భర్త షేక్ ఇస్మాయెల్‌ను విడిపించి స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన షేక్ నగీనా మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్ ఆల్ఫా సెంటర్, శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాంతంలో డ్రెయినేజి నిర్మాణంతోపాటు పూర్తి నిడివి గల రోడ్డు సౌకర్యం కల్పించాలని స్థానికులు విన్నవించారు. ప్రజారవాణా శాఖలో రెగ్యులర్ డ్రైవర్లుగా నియామక పత్రాలు పొందిన తమకు పూర్తి జీతం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రికి విజ్ఞప్తి చేశారు. 14 నెలలుగా పూర్తి జీతం రాక ఇబ్బందులు పడుతున్నామని లోకేశ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవుట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 1,800 మందికి వేతనాల పెంపుతోపాటు సర్వీసుతో కూడిన ఎఫ్‌టీఈ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భారీగా వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను విన్నవించారు. అందరి సమస్యలనూ ఓపిగ్గా విన్న లోకేశ్... పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.