Share News

Ongole MP Ticket : ఒంగోలు ఎంపీ టికెట్‌.. మాగుంటకు ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Jan 31 , 2024 | 03:57 AM

ప్రకాశం జిల్లా అధికార వైసీపీలో ముసలం ముదిరింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్‌ ఖరారు చేయడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.

Ongole MP Ticket : ఒంగోలు ఎంపీ టికెట్‌.. మాగుంటకు ఇవ్వాల్సిందే!

కాదని చెవిరెడ్డికి ఇస్తే సహకరించేది లేదు: బాలినేని

రంగంలోకి సజ్జల, సాయిరెడ్డి.. సీఎంను కలవాలని సూచన

అంగీకరించని మాజీ మంత్రి.. ఫలించని మంతనాలు

టీడీపీతో సంప్రదింపులు జరుపుతున్న మాగుంట

(ఒంగోలు/అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రకాశం జిల్లా అధికార వైసీపీలో ముసలం ముదిరింది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా సీఎం జగన్‌ ఖరారు చేయడంపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఒంగోలు లోక్‌సభ టికెట్‌ సిటింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ స్థానంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నిలబెడితే సహకరించే ప్రసక్తేలేదని కరాఖండీగా చెప్పేశారు. ఇక జగన్‌ను కలిసేది లేదని కూడా తెలిపారు. దీంతో ఆయన్ను సముదాయించేందుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. ఆయనతో మంతనాలు జరిపినా లాభం లేకపోయింది. అటు జగన్‌ ఉద్దేశం స్పష్టం కావడంతో మాగుంట ప్రత్యామ్నాయం వైపు వేగంగా పావులు కదుపుతున్నారని.. టీడీపీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఈ పరిణామాలు ప్రకాశం జిల్లా వైసీపీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి.

ఎంత చెప్పినా శాంతించని బాలినేని..

మాగుంటకు టికెట్‌ ఇవ్వనని గతంలోనే చెప్పిన జగన్‌.. ప్రత్యామ్నాయంగా జిల్లాకు చెందిన కొందరు నాయకులతోపాటు చెవిరెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. దీనిపై మాట్లాడేందుకు బాలినేనిని విజయవాడ పిలిపించారు. అయితే మంగళవారం ఉదయం విజయసాయిరెడ్డి ఆయనకు ఫోన్‌ చేసి.. ఒంగోలు ఎంపీ అభ ్యర్థిగా చెవిరెడ్డిని సీఎం ఖరారు చేశారని చెప్పారు. అంతేగాక తన పరిధిలో ఉన్న కొత్త ప్రకాశం జిల్లా, అలాగే నెల్లూరు జిల్లాలోని కందుకూరు, కావలి నియోజకవర్గాల పార్టీ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తున్నారని తెలిపారు. దీంతో బాలినేని ఒక్కసారిగా మండిపడ్డారు. మాగుంటకు కానిపక్షంలో జిల్లాలో మరెవరికైనా అవకాశం ఇవ్వాలని తాము కోరుతుంటే.. జిల్లాలో ఎవరినీ సంప్రదించకుండా చెవిరెడ్డిని ఖరారుచేయడాన్ని ఆక్షేపించారు. పైగా పార్టీ బాధ్యతలు కూడా అప్పగించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. బాలినేని తిరిగి హైదరాబాద్‌ వెళ్తున్నారని తెలియడంతో మధ్యాహ ్నం తర్వాత సజ్జల.. ఆయన బసచేసిన హోటల్‌కు వెళ్లి చర్చించారు. ఒకసారి సీఎంను కలవాలని సూచించగా.. ‘ఇంక కలిసేందుకు ఏముంది? ఒంగోలులో నివాసస్థల పట్టాల కోసం నిధులు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. ఇక పార్టీ వ్యవహారాలు పట్టించుకోను’ అని తేల్చిచెప్పినట్లు తెలిసింది. సజ్జల బయటకు వెళ్లేటప్పుడు మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మా పార్టీ వ్యవహారాలు మీకెందుకంటూ కసురుకుంటూ వెళ్లిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. తర్వాత బాలినేని అదే హోటల్లో తన కుటుంబ సభ్యులు, అక్కడికొచ్చిన ముఖ్య అనుచరులతో సమాలోచనలు సాగించారు.

అనుచరులతో మద్దిశెట్టి సమావేశం

మరోవైపు ఒంగోలు లోక్‌సభ టికెట్‌ ఆశించిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కూడా తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. ఆయన్ను దర్శి నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. మర్యాద కోసం కూడా మద్దిశెట్టిని బూచేపల్లి కలవలేదు. పైగా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఒకరిద్దరు మద్దిశెట్టి అనుచరులతో మంతనాలు చేస్తున్నారు. దర్శి నుంచి తప్పించినందున ప్రత్యామ్నాయంగా తనకు ఒంగోలు లోక్‌సభ టికెట్‌ ఇవ్వాలని సీఎంను మద్దిశెట్టి కోరగా.. అంగీకరించలేదు. మంగళవారం చెవిరెడ్డి పేరును ఖరారు చేయడంతో మద్దిశెట్టి కూడా తన రాజకీయ భవిష్యత్‌పై దృష్టిసారించారు. తన అనుచరులతో దర్శిలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాలు విన్నాక తుది నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. వైసీపీలో ఉన్నా లేకపోయినా.. దర్శిలో పార్టీ అభ్యర్థిని ఓడించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఈ భేటీ తలపెట్టినట్లు సమాచారం.

రాజీనామా చేస్తానని ఎవరితోనూ చెప్పలేదు‘ఆంధ్రజ్యోతి’తో బాలినేని

బాలినేనితో విజయసాయి, సజ్జల మంత్రాంగం ఫలించలేదని, ఆయన వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీనిపై ఆయన్ను మంగళవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. తాను పార్టీకి రాజీనామా చేస్తానని ఎవరితోనూ చెప్పలేదన్నారు. రాజీనామా చేశానంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని.. ఒంగోలు లోక్‌సభ టికెట్‌ మాగుంటకే ఇవ్వాలన్న డిమాండ్‌పై పునరాలోచనా లేదని స్పష్టం చేశారు. చెవిరెడ్డిని నిలబెడితే సహకరించనని విజయసాయి, సజ్జలకు స్పష్టం చేశానని బాలినేని చెప్పారు.

టీడీపీతో టచ్‌లోకి మాగుంట!

మాగుంటను కాదని చెవిరెడ్డి పేరును సీఎం ఖరారుచేశారని తెలియగానే.. ఎంపీ అనుచరులు భగ్గుమన్నారు. ఒంగోలు, కొండపి, కనిగిరి, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లోని అనుచర గణం ఎక్కడికక్కడ సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారు ఆయనకు ఫోన్‌ చేసి రాజకీయ భవితవ్యంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఏ నిర్ణయం తీసుకున్నా వెంటే ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలు టికెట్‌పై జగన్‌ నిర్ణయం ప్రకటించాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని ఇప్పటిదాకా చెబుతూ వచ్చిన మాగుంట.. తాజా పరిణామాలతో ఇక వేచిచూడడం అనవసరమన్న అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే టీడీపీ అగ్ర నాయకత్వంతో టచ్‌లో ఉన్న ఆయన.. పోటీపై చర్చించారు. ఎన్నికల బరిలో తాను, ఆయన కుమారుడు రాఘవరెడ్డిల్లో ఒకరే ఉండాలా.. ఇద్దరం చెరో స్థానంలో పోటీచేయాలా అన్న అంశంపై స్పష్టత తీసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం జిల్లాలో వైసీపీకి గట్టి షాకే ఇస్తుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

Updated Date - Jan 31 , 2024 | 05:18 AM