Share News

Vijayawada Floods: తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

ABN , Publish Date - Sep 03 , 2024 | 05:05 PM

సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇరురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు.

Vijayawada Floods: తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు ఎంతలా తల్లిడిల్లిపోయాయో తెలిసిందే. ఏపీలో విజయవాడ, పరిసర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం పట్టణ పరిసర ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా ఏపీలో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు అందించాలని ఇటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు హిందూపురం ఎమ్మెల్యే, దిగ్గజ సినీనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.


తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని బాలయ్య ప్రకటించారు. బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు తనవంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటన చేశారు.


Untitled-7.jpg

బాలయ్య ఎమోషనల్ పోస్ట్..

‘‘50 ఏళ్ల క్రితం మా నాన్న గారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. వెలుగుతూనే ఉంది. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీ కోసం.. మీ ఆనందం కోసం.. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నావంతు బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్లీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీ నందమూరి బాలకృష్ణ’’ అని బాలయ్య భావోద్వేగ పోస్ట్ పెట్టారు.


సీఎం చంద్రబాబు పిలుపునకు స్పందన..

సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ (మంగళవారం) కీలకమైన ప్రకటన చేశారు. వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచి మనసుతో ముందుకు రావాలని, ఎవరికి తోచిన విధంగా వారు సీఎం సహాయనిధికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఇచ్చిన ఈ పిలుపునకు స్పందన వస్తోంది. టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న సీఎం సహాయ నిధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. మరోవైపు స్వస్ఛంధ సేవాలు కూడా కదిలాయి. విజయవాడ వరద బాధితులకు సాయం చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు జై భారత్ క్షీరా ఆక్వా సంఘం తరఫున 2000, కాస్మో క్లబ్ తరఫున 3000 ఆహార పొట్లాలు విజయవాడకు తరలిస్తున్నారు. కాగా స్వచ్చంధంగా ముందుకొచ్చే దాతలకు మరింత సమాచారం అందించేందుకు 79067 96105 నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Updated Date - Sep 03 , 2024 | 06:02 PM