Share News

Nara Lokesh : రెడ్‌బుక్‌ చాప్టర్‌-3 తెరుస్తాం

ABN , Publish Date - Nov 02 , 2024 | 05:34 AM

రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే తెరుస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు.

Nara Lokesh : రెడ్‌బుక్‌ చాప్టర్‌-3 తెరుస్తాం
Minister Nara Lokesh

  • చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం

  • అట్లాంటా సభలో మంత్రి లోకేశ్‌.. ఎన్టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రెడ్‌బుక్‌లో ఇప్పటి వరకు రెండు చాప్టర్లను మాత్రమే తెరిచామని, మూడో చాప్టర్‌ను త్వరలోనే తెరుస్తామని మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన అట్లాంటాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు. త్వరలోనే రెడ్‌ బుక్‌ మూడో చాప్టర్‌ కూడా తెరుస్తాం’’ అని స్పష్టం చేశారు. యువగళం పాదయాత్రలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్‌బుక్‌కు వైసీపీ అధ్యక్షుడు జగన్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘గుడ్‌బుక్‌ తీసుకువస్తానని జగన్‌ అంటున్నారు. ఆ బుక్‌లో ఏం రాయాలో జగన్‌కు అర్థం కావడంలేదు.


గతంలో సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు భయపడకుండా ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ)లు నిలబడ్డారు’’ అని లోకేశ్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. సంక్షేమం అంటే ఏమిటో ఎన్టీఆర్‌ చేసి చూపారని గుర్తు చేశారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా తలెత్తుకుని తిరిగే పరిస్థితిని ఎన్టీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయడంలో ఎప్పుడూ ముందుంటామని లోకేశ్‌ ప్రకటించారు.


అమెరికాలోని ఆంధ్రులు ఎన్‌ఆర్‌ఐలు కాదని.. ‘ఎంఆర్‌ఐ’లని లోకేశ్‌ కొత్త నిర్వచనం చెప్పారు. మోస్ట్‌ రిలయబుల్‌ ఇండియన్స్‌(ఎంఆర్‌ఐ) అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి గెలుపు ప్రపంచంలోని ప్రతి తెలుగువారిదని లోకేశ్‌ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నేత కోమటి జయరాం తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ సమయంలో అభిమానులు హెలికాప్టర్‌ ద్వారా పూల జల్లు కురిపించారు.


Also Read:

మహిళలకు మహర్దశే!

వేషాలేస్తే తొక్కి నారతీస్తా.. పవన్ మాస్ వార్నింగ్..

అదే తీరు.. బ్యాటింగ్‌ మారలేదు!

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Nov 02 , 2024 | 08:17 AM