Pharma SEZ: విశాఖలో మరో ఫార్మా సెజ్
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:54 AM
విశాఖకు మరో మణిహారం అమరనుంది. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా మరో ఫార్మా సెజ్ ఏర్పాటు కానుంది.
నక్కపల్లి వద్ద 1,800 ఎకరాల్లో ఏర్పాటు
8న శంకుస్థాపన చేయనున్న ప్రధాని
ధ్రువీకరించిన ఎంపీ సీఎం రమేశ్
ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటు,
విశాఖ రైల్వే జోన్‌కూ పునాదిరాళ్లు
పూడిమడక లేదా విశాఖలో సభ!
అమరావతి, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): విశాఖకు మరో మణిహారం అమరనుంది. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కొత్తగా మరో ఫార్మా సెజ్ ఏర్పాటు కానుంది. ఆ జిల్లాలో ఇప్పటికే అచ్యుతాపురం వద్ద ఫార్మా సెజ్ ఉంది. ఇప్పుడు ఇంకోదానిని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ప్రధాని మోదీ జనవరి 9న శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటనను అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ధ్రువీకరించారు. బుధవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. నవంబరు 29వ తేదీనే ప్రధాని రావలసి ఉందని, ఆ సమయంలో వాతావరణం అనుకూలంగా లేక వాయిదా పడిందని.. ఇప్పుడు వచ్చే నెలలో వస్తున్నారని తెలిపారు. కాగా.. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉండడంతో అనకాపల్లి జిల్లాలో కేంద్రం కొత్త సెజ్‌ను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్థలం ఎంపిక పూర్తి చేసింది. నక్కపల్లి వద్ద సుమారు 1,800 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. సెజ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా నేల చదును, రహదారుల నిర్మాణం, విద్యుత్, నీటి సదుపాయం, ఇతర వసతులను కేంద్రం తన ఖర్చుతో సమకూరుస్తుంది. పనుల నిర్వహణకు టెండర్లు కూడా పిలిచింది. దీనిపై కేంద్రం సుమారు రూ.1,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అంచనా. ఇది పూర్తయితే పెద్ద సంఖ్యలో ఫార్మా పరిశ్రమలు వస్తాయని భావిస్తున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోకి నక్కపల్లి ప్రాంతం వస్తుంది.
ఫార్మా సెజ్‌తోపాటు ప్రధాని మరో రెండు శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద రూ.75 వేల కోట్లతో ఏర్పాటవుతున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌టీపీసీ ఏర్పాటు చేస్తోంది. సాధారణంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి భారీ స్ధాయిలో స్వచ్ఛమైన నీరు కావాలి. కానీ ఎన్‌టీపీసీ సముద్రపు నీటితో హైడ్రోజన్ తయారు చేసే టెక్నాలజీని కనుగొంది. ఆ టెక్నాలజీ సాయంతో పూడిమడక వద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది థర్మల్ విద్యుత్‌కు ప్రత్యమ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్‌ను వినియోగించే అవకాశం ఉంది. దీనితోపాటు విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర విభజన హామీల్లో జోన్ ఉన్న సంగతి తెలిసిందే. స్థలం సమస్యతో జగన్ ప్రభుత్వ హయాంలో ఇది నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం రాగానే సమస్యను పరిష్కరించి స్థలాన్ని రైల్వే శాఖకు అప్పగించింది. ఇందులో జోన్‌కు సంబంధించిన భవనాల నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటన సందర్భంగా పూడిమడక లేదా విశాఖలో బహిరంగ సభ నిర్వహించే అవకాశముంది. ప్రధాని సమయాన్ని బట్టి సభ వేదిక ఖరారవుతుందని, కొద్ది రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకుంటారని సీఎం రమేశ్ చెప్పారు.
అనకాపల్లికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు!!
అనకాపల్లి నియోజకవర్గానికి రూ.2 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రానున్నాయని ఎంపీ సీఎం రమేశ్ వెల్లడించారు. ‘రూ.75 వేల కోట్లతో పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఇప్పటికే మంజూరైంది. ఇదే ప్రాంతంలో ఆర్సెలార్ నిప్పన్ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో రూ.80 వేల కోట్లతో భారీ ఉక్కు కర్మాగారం కూడా రాబోతోంది. ముడి ఇనుప ఖనిజం సరఫరాపై ఎన్‌ఎండీసీతో ఒప్పందం పూర్తయ్యాక దీని శంకుస్థాపన జరుగుతుంది. ఫార్మా సెజ్‌లో కొన్ని ఫార్మా పరిశ్రమలు రానున్నాయి. పెద్ద అల్యూమినియం తయారీ కర్మాగారం కూడా రాబోతోంది. ఇవన్నీ వస్తే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవుతాయి’ అని ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.