Share News

మందు లేదు!

ABN , Publish Date - Sep 25 , 2024 | 04:38 AM

బహుళజాతి కంపెనీల (ఎంఎన్‌సీ) మద్యాన్ని అన్ని షాపుల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ప్రకటించిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది.

మందు లేదు!

మద్యం షాపులు దాదాపుగా ఖాళీ

డిపోల నుంచి సరఫరా నిలిపివేత

ఉన్న నిల్వలను అమ్మాలని ఆదేశాలు

ఖరీదైన లిక్కరే అందుబాటులో.. దీంతో

బార్లకు జనం బారులు.. ఖజానాకు గండి

కొత్త పాలసీ, బ్రాండ్ల పేరుతో

ప్రస్తుత అమ్మకాలపై అధికారుల నిర్లక్ష్యం

అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): బహుళజాతి కంపెనీల (ఎంఎన్‌సీ) మద్యాన్ని అన్ని షాపుల్లోనూ అందుబాటులోకి తీసుకొస్తామని ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ప్రకటించిన మరుసటి రోజు నుంచే రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. ఈ నెల 20న ఆయన ఆ ప్రకటన చేయగా.. అన్ని బ్రాండ్లూ రావడం మాట అటుంచి..చాలా షాపుల్లో ఉన్న బ్రాండ్లు కూడా కనిపించకుండా పోయాయి. ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉండే మద్యం అసలే దొరకడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన టీచర్స్‌ బ్రాండ్లు అమ్ముతున్నారు. క్వార్టర్‌కు రూ.200 పెట్టడమే ఎక్కువని వినియోగదారులు గగ్గోలు పెడుతుంటే.. రూ.600 పైగా ధరలున్న బ్రాండ్లు మాత్రమే విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఏర్పడిన ఈ మద్యం కొరత వల్ల అటు వినియోగదారుల జేబులు చిల్లు పడడంతో పాటు ప్రభుత్వ ఖజానాకూ గండి పడుతోంది. అనేక చోట్ల అతి తక్కువ బ్రాండ్లు మాత్రమే షాపుల్లో ఉండడంతో విక్రయాలు పడిపోతున్నాయి.

కొత్త పాలసీ చూపించి..

ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల పాలసీని ఎత్తివేసి.. ప్రైవేటు షాపుల పాలసీ తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొత్త పాలసీపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ కూడా రానుంది. వచ్చే నెల మొదటి వారం నాటికి నూతన విధానం అమల్లోకి వస్తుందని అంటున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ షాపులు ఉండవు కాబట్టి ఈలోగా వాటిలోని స్టాకు మాత్రమే అమ్మాలని అధికారులు షాపుల్లోని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. దీంతో డిపోల నుంచి షాపులకు మద్యం సరఫరా ఆగిపోయింది. స్టాకు లేదని సిబ్బంది చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రాత్రి వేళల్లో కిటకిటలాడే మద్యం షాపులు వెలవెలబోతున్నాయి. విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాల్లోనూ పరిమితమైన సంఖ్యలోనే బ్రాండ్లు అందుబాటులో ఉంచుతున్నారు.

బార్లకు మేలు చేసేలా..

మద్యం షాపుల్లో తమకు నచ్చిన బ్రాండ్లు దొరక్కపోవడంతో వినియోగదారులు బార్లకు వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం బార్లలో కేవలం రెస్టారెంట్‌లోనే మద్యం సర్వ్‌ చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా అనేక చోట్ల బార్ల యాజమాన్యాలు యథేచ్ఛగా సీసాలు బయటకు విక్రయిస్తున్నారు. ఇప్పుడు షాపుల్లో బ్రాండ్లు లేకపోవడం బార్లకు కలిసివస్తోంది. బార్లలో ఒక క్వార్టర్‌పైనే రూ.50 నుంచి రూ.80 అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే కొత్త పాలసీని చూపించి ముందుగానే షాపులను ఖాళీ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. స్టాకు ఖాళీ చేస్తే ప్రభుత్వ షాపుల్లో లెక్కలు సులభంగా ఉంటాయని, మిగిలిపోయిన స్టాకు వెనక్కి తీసుకెళ్లడం కష్టమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కారణాలతో బార్లకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్య వైఖరి

ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారులు మద్యం అమ్మకాలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. బదిలీలు, కొత్త పాలసీలపై దృష్టిపెట్టిన వారు.. ప్రస్తుత పాలసీని, అమ్మకాలను గాలికొదిలేశారు. ఎంతసేపూ అంతర్జాతీయ బ్రాండ్లు తెస్తున్నాం.. ధరలు తగ్గిస్తున్నామని ప్రకటనలు చేయడం తప్ప.. కొత్త పాలసీ వచ్చేలోగా ఉన్న పాలసీతో పనిలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమ్మకాలు తగ్గిపోవడంతో ఆదాయం పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున నెలకు రూ.2,300 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఈ మార్కును చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. షాపుల్లో మద్యం కొరతపై ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆయనే బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఎండీగా వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్‌ అధికారులు కూడా దీనిపై స్పందించడం లేదు. మొత్తంగా అధికారుల తీరుతో ప్రభుత్వ ఖజానాకు రావలసిన ఆదాయం పక్కదారి పడుతోంది.

Updated Date - Sep 25 , 2024 | 07:56 AM