మధుసూదన రెడ్డిపై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Aug 17 , 2024 | 03:04 AM
ఫైబర్‌నెట్ సంస్థను సొంతజాగీరుగా చేసుకుని గత ఐదేళ్లూ చెలరేగిపోయిన మాజీ ఎండీ ఎం.మధుసూదనరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
ఇప్పటికే ఫైబర్‌నెట్ ఎండీగా తొలగింపు
జగన్ అండతో నాడు ఫైబర్‌నెట్‌లో ఇష్టారాజ్యం
వైసీపీ కార్యకర్తలకు భారీగా కొలువులు
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్ సంస్థను సొంతజాగీరుగా చేసుకుని గత ఐదేళ్లూ చెలరేగిపోయిన మాజీ ఎండీ ఎం.మధుసూదనరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఐఆర్‌ఏఎస్ బ్యాచ్‌కు చెందిన మధుసూదనరెడ్డిని గత సీఎం జగన్ 2020 మే19వ తేదీన ఫైబర్‌నెట్ ఎండీగా ఏరికోరి నియమించారు. జగన్ మనసు తెలిసిన అధికారిగా.. ఫైబర్‌నెట్‌ను విచ్చలవిడి అవినీతికి, వైసీపీ రాజకీయ అవసరాలకు కేంద్రంగా మార్చారు. ఆయన భార్య వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. ఫైబర్‌నెట్ కార్యాలయాన్ని బంధువులు, సన్నిహితులతో నింపేశారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఈ ఏడాది జూన్ ఏడో తేదీన మధుసూదనరెడ్డిని ఎండీగా తప్పించింది. డిప్యుటేషన్ మీద వచ్చిన ఆయనను తిరిగి కేంద్ర సర్వీసులకు పంపకుండా రాష్ట్రంలోనే ఉండాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీతో ఆయన డిప్యుటేషన్ కాలపరిమితి పూర్తికానుంది. ఈ లోగానే ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధుసూదనరెడ్డి వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మధుసూదనరెడ్డి, ఆయన బంధువర్గంపై దర్యాప్తు జరిపించాలని టీడీపీ నేతలు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌ను కోరారు. ఆ మరునాడే ఆయనపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు పడింది.
ఆది నుంచీ ఆరోపణలే ..
ఫైబర్‌నెట్ ఎండీగా,ఆది నుంచీ మధుసూదనరెడ్డి తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. తన బంధుగణంతో ఫైబర్‌నెట్‌ను నింపేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సిఫారసు చేసిన వారికందరికీ అర్హత లేకున్నా ఉద్యోగాలిచ్చారు. విచ్చల విడిగా సాగిన ఆర్థిక దుర్వినియోగంతో సంస్థ ఆర్థికంగా దెబ్బతింది. మధుసూదనరెడ్డి రాక ముందు నెలనెలా రూ.17 కోట్ల రాబడి ఫైబర్ నెట్‌కు ఉంది. అప్పట్లో కనెక్షక్‌కు నెలవారీ రూ.199 వసూలు చేశారు. మధుసూదనరెడ్డి అడుగుపెట్టాక.. దానిని రూ.599కు పెంచారు. అయినా రాబడి 12 కోట్లు మాత్రమే వచ్చేది. ఆయనకు ముందు 9,70,000గా ఉన్న కనెక్షన్లు.. గతఐదేళ్లలో ఏడున్నర లక్షలకు పడిపోయారు. అందులోనూ... నాలుగు లక్షలకే లెక్క లు చూపించారు. మిగిలిన కనెక్షన్లను అధికారిక లెక్కల్లో చూపకుండా వసూళ్లు చేసుకున్న డబ్బులు జేబులో వేసుకున్నారు. మధుసూదనరెడ్డి బాధ్యతలు చేపట్టక ముందు కోర్ స్టాప్ 120 మంది మాత్రమే ఉండేవారు. . వారి జీతభత్యాల కోసం నెలకు రూ.40 లక్షల దాకా చెల్లించేవా రు. కానీ, ఆయనను సస్పెండ్ చేసే సమయానికి 1350 మంది ఉద్యోగు లు ఉన్నారు. రూ.4.20 కోట్ల మేర జీత భత్యాలకు చెల్లించారు. అయితే, వీరిలో ఎక్కువమంది వైసీపీ కార్యకర్తలే ఉన్నారనే విమర్శలు వచ్చాయి.
బంధువులు, సన్నిహితులకు పదవులు ..
మధుసూదనరెడ్డి పెద్దన్న మద్దిరాల కంచంరెడ్డి ఫైబర్ నెట్‌లో ఆర్థిక వ్యవహారాలు నడిపించారన్న ఆరోపణలున్నాయి. ఫైబర్‌నెట్ ఏజీఎం (ఉయ్యూరు) గుణశశాంక్‌రెడ్డి ద్వారా బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను మార్పింగ్ చేసి సంస్థ ఆదాయాన్ని ముంబై ఖాతాకు మళ్లించారన్న అభియోగాలూ ఉన్నాయి. మధుసూదనరెడ్డి ఆర్థిక వ్యవహారాల్లో సన్నిహితులైన ఏజీఎం భాస్కర్‌రెడ్డి , గ్రీన్ లాంతెర్న్ ఐటీ సంస్థ యజమాని శేశిరెడ్డి ద్వారా వ్యవహారాలను నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. మధుసూదనరెడ్డి ఆర్ధిక వ్యవహారాల్లో ఫైబర్ నెట్ మేనేజర్ కిరణ్‌కుమార్‌రెడ్డి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరితోపాటు.. ఏజీఎం సుభాన్ పూర్తిస్థాయిలో మధుసూదనరెడ్డికి సహకారాన్ని అందించారని చెబుతున్నారు. ఫైబర్ గ్రిడ్ ఈడీ పిళ్లా జగన్మోహనరావు పైనా ఆర్థిక ఆరోపణలు వచ్చాయి.
తిన్నవారంతా బాగున్నారు... పనిచేసేవారే సమిధలయ్యారు
మధుసూదనరెడ్డి జమానాలో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డ తిమింగలాలన్నీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయా రు. కానీ, సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న సిబ్బంది మాత్రం జీతభత్యాలు లేక పడరాని పాట్లు పడుతున్నారు. మధుసూదనరెడ్డిపై సమగ్ర దర్యాప్తు చేయడంతో సహా.. ఆయనకు సహకరించినవారందరిపైనా కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తే .. వాస్తవాలు వెలుగు చూస్తాయని సిబ్బంది చెబుతున్నారు.