Jubilee Celebrations : నేడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం
ABN , Publish Date - Dec 14 , 2024 | 03:55 AM
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు విజయవాడ సమీపంలోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్సులో శనివారం వైభవంగా జరగనున్నాయి.

వేడుకలకు ముస్తాబైన పోరంకి
పెనమలూరు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు విజయవాడ సమీపంలోని పోరంకిలో ఉన్న మురళీ రిసార్ట్సులో శనివారం వైభవంగా జరగనున్నాయి. వేడుకల వివరాలను ఉత్సవ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్, ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో కలిసి శుక్రవారం విలేకరులకు వివరించారు. జనార్దన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ప్రారంభించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను ఏడాదిపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని తెలిపారు. పోరంకితోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు తదితర నగరాలలో నిర్వహిస్తామన్నారు. తారకరామం పేరుతో అన్న గారి అంతరంగం పుస్తకాన్ని వేడుకల్లో ఆవిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను భావితరాల కోసం పాఠ్యపుస్తకాల్లో పొందుపరుస్తామని తెలిపారు. నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ సూర్యచంద్రులు ఉన్నంతవరకు అన్నగారి పేరు నిలిచి ఉంటుందని, రాజకీయాల్లో, సినీరంగంలో ఎన్టీఆర్ ఒక ధృవతార అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ లాంటి ఒక మహానుభావుడి సినీ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించడం తెలుగుజాతి చేసుకొన్న అదృష్టమని తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎన్టీఆర్ కుమారులు మోహనకృష్ణ, జయశంకరకృష్ణ, ఎన్టీఆర్ తొలిచిత్రం మనదేశం నిర్మాత కృష్ణవేణి తదితర సినీ ప్రముఖులు హాజరవుతారని తెలిపారు.