Share News

అరకొర లెక్కలే శ్వేతపత్రంలో పూర్తి వివరాలేవీ?

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:11 AM

ఆర్థిక రంగంలో జగన్‌ చేసిన విధ్వంసంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం సమగ్రంగా లేదు.

అరకొర లెక్కలే శ్వేతపత్రంలో పూర్తి వివరాలేవీ?

సమాచారం దాస్తున్న అధికారులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆర్థిక రంగంలో జగన్‌ చేసిన విధ్వంసంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం సమగ్రంగా లేదు. గత ప్రభుత్వంలో చేసిన అప్పులకు సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు ప్రభుత్వానికి పూర్తిగా సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. జగన్‌ ప్రభుత్వంలో ఆర్థిక శాఖలో పనిచేసిన అధికారులనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగిస్తుండటమే ఈ పరిస్థితికి కారణమని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. శ్వేతపత్రంలో పబ్లిక్‌ డెట్‌ రూ.4.38 లక్షల కోట్లు ఉన్నట్టు రాశారు. కానీ ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసిన స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ పుస్తకంలోని వివరాల ప్రకారం ఏపీ పబ్లిక్‌ డెట్‌ రూ.4.85 లక్షల కోట్లు ఉంది. ఇక్కడే రూ.47,000 కోట్ల తేడా కనిపిస్తోంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్లు సృష్టించి మరీ రాజ్యాంగ విరుద్ధంగా లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. ఏపీ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లాంటివి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కానీ శ్వేతపత్రంలో కార్పొరేషన్ల వారీగా అప్పుల వివరాలు చూపించలేదు. పైగా కార్పొరేషన్ల అప్పులంటూ రూ.2.48 లక్షల కోట్లుగా వేశారు. ఇందులో ఆయా కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులెంత, నాన్‌ గ్యారెంటీ అప్పులెంత అనేది చెప్పనేలేదు. కార్పొరేషన్ల నాన్‌ గ్యారెంటీ అప్పులు రూ.80,000 కోట్లు ఉన్నాయి. వీటిని చూపించలేదు. అలాగే పెండింగ్‌ బిల్లులు రూ.1,35,224 కోట్లు ఉన్నట్టు రాశారు. ఇంధన రంగంలో ఉన్న రూ.35,000 కోట్ల పెండింగ్‌ బిల్లులను రూ.5,000 కోట్లుగానే చూపించారు. దాదాపు రూ.1.80 లక్షల కోట్ల పెండింగ్‌ బిల్లుల వివరాలు ఆర్థిక శాఖ వద్ద ఉన్నప్పటికీ కేవలం వాటిని రూ.1.35 లక్షల కోట్లకే పరిమితం చేశారు. ఇంకా తవ్వితే పెండింగ్‌ బిల్లులు రూ.2 లక్షల కోట్లకు చేరుకుంటాయి. సరిగ్గా సమాచారం ఇవ్వని అధికారులపైనే ఆధారపడటం తప్ప బాధితుల కోసం ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేసి వారి నుంచి పెండింగ్‌ బిల్లుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది. పంచాయతీలు, ఉద్యోగుల నిధులు రూ.5,308 కోట్లు దారి మళ్లించినట్టు శ్వేతపత్రంలో రాశారు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు భారీగా దారి మళ్లించారు. వాటి వివరాలు రాయలేదు.

శ్వేతపత్రంలో వడ్డీలు రాసి, అసలు మర్చిపోయారు. ఏడాదికి డెట్‌ సర్వీసింగ్‌ ఖర్చు రూ.71,881 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పుస్తకంలో పబ్లిక్‌ డెట్‌ కింద చెల్లించాల్సిన అప్పుల అసలు రూ.25,212 కోట్లు, వడ్డీ రూ.28,017 కోట్లు... మొత్తం రూ.53,229 కోట్లు చెల్లించాలి. కార్పొరేషన్ల అప్పు రూ.3.30లక్షల కోట్ల నుంచి రూ.3.50 లక్షల కోట్ల వరకు ఉంటుంది. సగటున 9శాతం వడ్డీ లెక్కేసినా ఏడాదికి రూ.42,000 కోట్లు అసలు, వడ్డీ ఉంటుంది. కానీ పబ్లిక్‌డెట్‌పై చెల్లించాల్సిన వడ్డీ రూ.28,017కోట్లు, కార్పొరేషన్‌ అప్పుల వడ్డీ రూ.42,000 కోట్లు కలిపి మొత్తం డెట్‌ సర్వీసింగ్‌ దాదాపు రూ.71,000 కోట్లు వేశారు. చెల్లించాల్సిన అసలు రూ.25,212 కోట్ల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

Updated Date - Jul 27 , 2024 | 07:24 AM