Share News

రిమాండ్‌ ఉత్తర్వుల కాపీ నిందితుడు అడగలేదు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:42 AM

సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు నిందితుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అదే రోజు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు.

రిమాండ్‌ ఉత్తర్వుల కాపీ నిందితుడు అడగలేదు

దరఖాస్తే చేయలేదని మా విచారణలో తేలింది: హైకోర్టు

కౌంటర్‌ వేయాలని పోలీసులకు ఆదేశం

అమరావతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టినందుకు నిందితుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అదే రోజు మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టుకు నివేదించారు. నిందితుడికి మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారని తెలిపారు. అతడు జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నందున హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ చెల్లుబాటు కాదని, ప్రస్తుత పిటిషన్‌కు విచారణార్హతే లేదన్నారు. న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. రిమాండ్‌ ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీ కోసం పిటిషనర్‌ ఎలాంటి దరఖాస్తూ చేయలేదని పరిపాలనాపరంగా తాము జరిపిన విచారణలో తేలినట్లు పేర్కొంది. సర్టిఫైడ్‌ కాపీ జారీ చేయాలని సంబంధిత మేజిస్ట్రేట్‌కు తామే సూచనలు చేస్తామని తెలిపింది. వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరం లేవనెత్తుతున్నందున విచారణ కొననసాగించడానికి పోలీసులు కౌంటర్‌ దాఖలు చేయడం అవసరమని అభిప్రాయపడింది. కేసు వివరాలతో పాటు వ్యాజ్యం విచారణార్హతపై కౌంటర్‌ వేసేందుకు వారికి సమయం ఇస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.

ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. సామాజిక మాధ్యమాల్లో తన కుమారుడు వెంకటరామిరెడ్డి అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారని పేర్కొంటూ పల్నాడు జిల్లా ఐనవోలు పోలీసులు అక్రమంగా నిర్బంధించి కేసు పెట్టారని.. మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ ఉత్తర్వులు చెల్లుబాటు కావంటూ వైసీపీకి చెందిన పప్పుల చలమారెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం విచారణ సందర్భంగా పోలీసుల తరఫున ఏజీ వాదనలు వినిపించారు. నిందితుడికి ఆరెస్టుకు కారణాలు తెలియజేయలేదన్న వాదనలో వాస్తవం లేదని, అరెస్టుకు కారణాలను నిందితుడు ప్రస్తుత పిటిషన్‌కూ జతచేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌ ట్రయల్‌ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశారని, అది బుధవారం విచారణకు కూడా వచ్చిందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు సమయమివ్వాలని అభ్యర్థించారు. ధర్మాసనం అంగీకరించి.. రిమాండ్‌ ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీ కోసం పిటిషనర్‌ దరఖాస్తు చేయలేదని తమ విచారణలో తేలిందని, ఈ వ్యవహారాన్ని మరోసారి పరిశీలించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి సూచించింది.

Updated Date - Nov 21 , 2024 | 04:42 AM