Share News

మీ కపట నాటకానికి మా సంఘీభావమా..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:45 AM

వైఎస్‌ జగన్‌... మీ ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సంఘీభావం ప్రకటించాలి? సిద్ధం అన్నవాళ్లకు 11 మంది బలం సరిపోలేదా...

మీ కపట నాటకానికి మా సంఘీభావమా..!

సిద్ధమన్నారుగా... 11 మంది బలం సరిపోలేదా?

వైఎస్‌ జగన్‌ను నిలదీసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ జగన్‌... మీ ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సంఘీభావం ప్రకటించాలి? సిద్ధం అన్నవాళ్లకు 11 మంది బలం సరిపోలేదా... ఇప్పుడు కలసి పోరాడుదాం అంటున్నారు?’ అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. ‘ఢిల్లీలో నా ధర్నాకు ఎందుకు రాలేదో కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కష్టాల్లో ఉంటే షర్మిల అడ్డుపడుతారు’ అంటూ ఎక్స్‌ వేదికగా జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె శనివారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘అసలు మీకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? మీ పార్టీ ఉనికి కోసం కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉంది. ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను ఆ పార్టీకి తాకట్టుపెట్టారు. ఆఖరుకు మణిపూర్‌ ఘటనపై నోరెత్తని మీకు... ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరం.

క్రిస్టియన్‌ అయికూడా క్రైస్తవులను ఊచకోతకు గురిచేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చారు కదా? వైఎస్‌ఆర్‌ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకి జై కొట్టారు కదా? మణిపూర్‌ ఘటనపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి సంఘీభావం వచ్చిందా?’ అంటూ షర్మిల నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీతో అక్రమ సంబంధం ఎందకు కొనసాగించారో, ప్రత్యేక హోదా, పోలవరం కోసం ధర్నాలు ఎందుకు చెయ్యలోదో, పూర్తి మద్యపాన నిషేధం, వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. చెప్ప లేకపోతే ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వైసీపీ తరహాలో వ్యవహరించబోమన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదాను కూడా ఊడబీకితే, దానికోసం కోర్టు గుమ్మాలు తట్టే బ్యాచ్‌ వైసీపీ అని ఎద్దేవా చేశారు.జగన్‌లా వెన్నుపోటు రాజకీయాలు చేయబోమన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:46 AM