పింఛనుదారుల్లో 3 లక్షల మంది అనర్హులు
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:10 AM
రాష్ట్రంలో మూడు లక్షల మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నారు. వారిని గుర్తించేందుకు అధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు’ అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు.
వారిని గుర్తించేందుకు గ్రామాల్లో సర్వే
ప్రభుత్వంపై 1,400 కోట్ల భారం: స్పీకర్ అయ్యన్న
నాతవరం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో మూడు లక్షల మంది అనర్హులు పెన్షన్ పొందుతున్నారు. వారిని గుర్తించేందుకు అధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు’ అని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయ్యన్న మాట్లాడారు. ‘చేతులు ఉన్నవారికి కూడా లేనట్టు వైద్యులు తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. దాంతో అనర్హులు దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది. మూడు లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకోవడం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.1,440 కోట్ల భారం పడుతుంది. అనర్హులకు పింఛన్లు తొలగిస్తే ఆ సొమ్ముతో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు’ అని అయ్యన్న అన్నారు.