Share News

Gajuwaka MLA: ఎవరీ పల్లా శ్రీనివాసరావు?

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:51 PM

ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న కె. అచ్చెన్నాయుడును చంద్రబాబు తన కేబినెట్‌లోకి తీసుకున్నారు.

Gajuwaka MLA: ఎవరీ పల్లా శ్రీనివాసరావు?
AP TDP Chief Palla Srinivas Rao

ఏపీ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు పేరుని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రకటించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న కే. అచ్చెన్నాయుడును చంద్రబాబు తన కేబినెట్‌లోకి తీసుకొని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారి ఎంపిక అనివార్యమైంది. ఆ క్రమంలో విశాఖపట్నం నగరానికి చెందిన పల్లా శ్రీనివాసరావుకు రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను టీడీపీ అధిష్టానం అప్పగించింది.


ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌పై 95,235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు అగ్రస్థానంలో నిలిచారు.


2014 ఎన్నికల్లో సైతం గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో పల్లా శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీలో సీనియర్లు.. సూపర్ సీనియర్లు ఎంతో మంది ఉన్నా.. వారిని కాదని పల్లా శ్రీనివాసరావునే పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం వెనుక ఏమైనా కారణాలున్నాయా? అనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. 2014లోనే కాదు.. 2019లో విశాఖపట్నం నగరంలో తెలుగుదేశం పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో పసుపు జెండా రెపరెపలాడిందంటే అందుకు పల్లా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారనే ఓ చర్చ నేటికీ కొనసాగుతోంది.


అంతేకాదు.. గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా టీడీపీ చేపట్టిన అన్ని ఆందోళనా కార్యక్రమాలు విజయవంతం కావడంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య పాత్ర ఉందనేది సుస్పష్టం. ఇక ఏపీ సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు.. తన కేబినెట్‌ను కొత్త పాత మేలి కలియికతో రూపొందించారు. అదే తరహాలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారనే ప్రచారం సైతం సాగుతుంది.

అదీకాక 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున విశాఖపట్నం ఎంపీగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. నాటి నుంచి ఆ పార్టీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేష్ చేసిన పల్లా శ్రీనివాసరావు.. గతంలో సివిల్ కన్సల్టెన్సీని నిర్వహించారు.


తెలుగుదేశం పార్టీకి బలం, బలగం బీసీలు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఆ నియమాన్ని ఏ మాత్రం విస్మరించడం లేదనేందుకు పల్లా శ్రీనివాసరావు ఎంపికే అత్యుత్తమ ఉదాహరణ. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన కళా వెంకట్రావ్, కె. అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావులది బీసీ సామాజిక వర్గమే. అంతే కాకుండా వీరి ముగ్గురిది ఉత్తరాంధ్ర ప్రాంతామే కావడం గమనార్హం. సైకిల్ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం ఆయువు పట్టు అన్న సంగతి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా నియామకంతో మరోసారి సుస్పష్టమైంది.

For More National News and Telugu News..

Updated Date - Jun 14 , 2024 | 06:08 PM