Pawan Kalyan : సనాతన ధర్మంపై దాడిని సహించం!
ABN , Publish Date - Oct 04 , 2024 | 04:09 AM
సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
శ్రీవారి లడ్డూ అపవిత్రం చిన్న విషయం కాదు
‘‘ఏడుకొండల స్వామి ప్రసాదంలో అపచారం జరగడం చిన్న విషయం కాదు. దీని వెనుక చాలా ఉంది. వేల కోట్లు స్వాహా చేసిన వ్యక్తి ఏం తెలియనట్టు సుప్రీం కోర్టుకు వెళ్లారు. జగన్ అమాయకత్వం నటిస్తున్నారు. నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే మాత్రం రాజకీయం అంటూ అపహాస్యం, అవహేళన చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటించడం కూడా పాపంగా మాట్లాడుతున్నారు’’
- డిప్యూటీ సీఎం పవన్
దైవానికి అపచారం జరిగితే ఊరుకుంటామా?
నాటి సీఎంగా జగన్ బాధ్యత వహించాల్సిందే
వేల కోట్లు తిన్న వ్యక్తి ఏమీ తెలియనట్టు కోర్టుకు
వైసీపీకి 11 సీట్లే ఇచ్చినా బుద్ధి రాలేదు
ఆయనపై కేసులనూ సుప్రీం పరిగణించాలి
తిరుపతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ నిప్పులు
రాహుల్, ఉదయనిధిపై పరోక్ష విమర్శలు
తిరుపతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఎవరైనా సరే తుడిచిపెట్టుకుపోతారని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. దీనిపై బలమైన చట్టం రావాల్సి ఉందన్నారు. గురువారం రాత్రి తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే కూడలిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో ఆయన ప్రసంగించారు. అత్యధిక అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలిచి కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన తమ కూటమి ప్రభుత్వానికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని, ఇప్పుడేమీ ఎన్నికలు కూడా లేవని తెలిపారు. ‘‘అధికారంలోకి వచ్చి కేవలం వంద రోజులే అయింది. ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమాలపై ఇచ్చిన హామీలను ఎలా నిలబెట్టుకోవాలా అన్నదాని గురించే ఇపుడు మేం ఆలోచిస్తున్నాం. దెబ్బతిన్న ఆర్థిక పరిస్థితిని ఎలా నిలబెట్టాలన్నదాని గురించే ఆలోచన తప్ప రోడ్డుపైకి రావాలని ఏనాడూ అనుకోలేదు. దశాబ్దంపైగా నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా, అవమానాలు చేసినా నేను పల్లెత్తు మాట మాట్లాడలేదు. కక్ష సాధింపులు ఉండవని గెలిచిన వెంటనే చెప్పాం. అయితే కలియుగ దైవానికి అపచారం జరిగితే ఎందుకు ఊరుకుంటాం’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అన్నీ రాజకీయాలేనా...అన్నీ ఓట్ల కోసమేనా అని ప్రశ్నించారు. వారాహి సభలో పవన్ ఇంకా ఏమన్నారంటే..
గొడవ పెట్టుకోవడానికే వచ్చా
‘‘ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోవాలి. అల్లా అంటే వారు ఆగిపోతారు. అదే గోవిందా అంటే మనం ఆగిపోం. మనం హైందవ ధర్మానికి గౌరవం ఇవ్వడం లేదు. నేను జేజేలు కొట్టించుకోవడానికి రాలేదు. ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చాను. ఉప ముఖ్యమంత్రిగానో లేక జనసేన పార్టీ అధ్యక్షుడిగానో కాదు... సగటు దేశ పౌరుడుగా జాతి మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. సగటు భారతీయుడిగా హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. అదే సమయంలో ఇస్లాం, క్రైస్తవం, బౌద్ధం, సిక్కు తదితర అన్యమతాలను గుండెల నిండా గౌరవిస్తాను. వసుధైక కుటుంబంగా అన్ని ప్రాణులు, జాతులు, ప్రాంతాలు సుఖంగా ఉండాలని కోరుకునే సనాతనధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరాముడు. అనేక పేర్లతో పిలుచుకునే ఏడుకొండల వాడి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే రాజకీయం, అపహాస్యం, అవహేళన చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని పాటించడం పాపంగా మాట్లాడుతున్నారు’’
‘‘సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాజకీయ స్థాయిని, అధికారాన్ని, పదవులను పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమే. 21 ఏళ్ల వయసులో ఇదే తిరుపతిలో సనాతన ధర్మాన్ని ఆచరించడం మొదలుపెట్టాను. ఇన్నేళ్లలో ధర్మాన్ని ఎప్పుడూ తప్పలేదు. నమాజ్ వినిపించగానే గౌరవ సూచకంగా ప్రసంగాలను నిలిపివేశాను. నిన్న నా కుమార్తె రష్యన్ క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇప్పించి నా చిత్తశుద్ధి చూపించాను. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఏ దారైతే ముందుకు తీసుకెళ్తుందో అదే నా దారి. ఏ దారైతే అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో అదే నా దాది. ఏ మార్గంలో మరణం కూడా మహా ప్రభంజనమవుతుందో అదే నా మార్గం. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్ అంటున్నారు. అందరం కొలిచే శ్రీరాముడిని పాదరక్షలతో కొడుతూ ఊరేగింపు తీశారు. శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యితో తయారుచేసిన ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా పంపారు. వాటినే అయోధ్య రాముడికి పంపారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయ ప్రారంభ వేడుకలను ‘నాచ్ గానా’ (తైతక్కలు) అంటూ అవహేళన చేశారు. మోదీని, నన్ను ద్వేషించండి. కానీ, రాముడ్ని ద్వేషించవద్దు. హిందువులుగా మేమెవరం నోరెత్తకూడదా? బాధపడకూడదా? ఏదైనా అంటే మాత్రం హిందూ మతతత్వవాదులైపోతాం. ఇదే విధంగా క్రైస్తవులను, ఇస్లామ్‌ను అనగలరా? అంత ధైర్యం ఉందా?’’
జగన్‌పై కేసులను సుప్రీం గమనించాలి...
‘‘తిరుమల ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని చిన్న విషయంగా భావించకూడదు. లడ్డూ కల్తీ కేసులో సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. నాకు సుప్రీం కోర్టుపై, న్యాయ వ్యవస్థపై గౌరవం ఉంది. రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏమి జరిగింది? తిరుమలలో పవిత్రత ఎలా దెబ్బతినింది? అన్న విషయాలు ఆలోచించాల్సి ఉంది. లడ్డూ కల్తీకి మాజీ సీఎం జగన్ ప్రత్యక్షంగా కారణమని నేనెప్పుడూ ఆరోపించలేదు. కానీ, ఆయన పాలనలో ఏర్పాటైన టీటీడీ బోర్డు సరైన నిర్ణయాలు తీసుకోనప్పుడు దానికి జగనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సీఎం చంద్రబాబు లడ్డూ కల్తీ విషయాన్ని మీడియాతో మాట్లాడలేదు. ఎమ్మెల్యేలతో సమావేశంలో మాత్రమే మాట్లాడి వాస్తవాలు చెప్పారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిక్లీన్‌చిట్ ఇచ్చుకోవడానికి ముందు బోర్డులో ఆయన తన హయాంలో ఏమి చేశారో దేశానికి చెప్పాలి. శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి విరాళంగా రూ.10,500 తీసుకుని రూ.500కు మాత్రమే రశీదు ఇచ్చారు. లడ్డూ కల్తీ చిన్న వ్యవహారం కాదు. దీని వెనుక చాలా ఉంది. వేల కోట్లు స్వాహా చేసిన వ్యక్తి ఏం తెలియనట్టు నటిస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. టీటీడీలో అక్రమాలపై గత ఐదేళ్లుగా చెబుతునే ఉన్నాం. జాతీయ మీడియాకు ఆధారాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. జగన్ అమాయకత్వం నటిస్తున్నారు. జగన్‌పై 29 కేసులు నమోదై ఉన్నాయి. వేల కోట్లు స్వాహా చేశారు. ఆయన పాలనలో 31 వేల మంది యువతులు అదృశ్యమయ్యారు. 290 గుడులు ధ్వంసం చేశారు. రాముడి విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో రథాన్ని కాల్చివేశారు..వీటన్నింటిని కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుని తీర్పు ఇవ్వాలి’’
ధర్మారెడ్డి ఏమైపోయారు?
‘‘తాను తప్పు చేయలేదని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్‌రెడ్డి హారతులు వెలిగిస్తున్నారు. అలాంటి డ్రామాలు వద్దు. దీనిపై పాత ఈవో ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన ఏమైపోయారు? ఎక్కడున్నారు? తిరుమల పవిత్రత విషయంలో ఎన్ని ఉల్లంఘనలు జరిగాయో నాకు తెలుసు. కొడుకు చనిపోతే ఆలయంలోకి రాకూడదు. అయినా ధర్మారెడ్డి శ్రీవారి ఆలయంలోకి వచ్చారు. ఆమాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి ఈవోగా ఎలా ఉన్నారు? ఆయనపై 2005లో కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. వాటిని బయటికి తీసుకొస్తాం. తిరుమల లడ్డూను కల్తీ చేయడం సనాతన ధర్మంపై దాడి’’
‘‘ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో టీటీడీలో అపచారం జరుగుతోందని, సరిదిద్దుకోవాలని చెప్పాను. అయితే భగవంతుడు 11 సీట్లకు కుదించినా ఇంకా బుద్ధి రాలేదు. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి. ఒకటికి పరిమితం చేద్దాం. ఇలా మాట్లాడే అవసరం రాదనుకున్నాను. అయితే వైసీపీ నాయకులే ఆ పరిస్థితి కల్పించారు’’
‘‘సనాతన ధర్మాన్ని పాటించేవారి విషయంలో చట్టాలు నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య మతాలు పాటించేవారిపై మానవత్వం చూపుతాయి. దూషించేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. సనాతన ధర్మం ఒక వైరస్ అని, దాన్ని అంతం చేస్తామని ఇటీవల ఒక యువ నాయకుడు కామెంట్ చేశారు. ఇదే ఇస్లాం విషయంలో అయితే కోర్టులన్నీ ఒక్కటై శిక్షిస్తాయి. కానీ, రాముడిని తిట్టినా, అమ్మవారిని దూషించినా కోర్టులు మాట్లాడబోవు’’
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
వారాహి డిక్లరేషన్‌లో అంశాలివే!
సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుంటూనే ఇతర మతాలను గౌరవిద్దామని వారాహి డిక్లరేషన్‌లో పవన్ అన్నారు.
ఏ మతానికీ, ధర్మానికీ భంగం వాటిల్లినా ఒకే విధంగా స్పందించేలా లౌకక వాదాన్ని పాటించాలి.
ఏ మత విశ్వాసానికీ భంగం కలగకుండా అడ్డుకట్ట వేసేలా బలమైన చట్టాన్ని ఏర్పాటు చేయాలి.
జాతీయ, రాష్ట్రాల స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులు ఏర్పాటు కావాలి. ఏటా నిధులు కేటాయించాలి.
ఆలయాల్లో నైవేద్యాలు, ప్రసాదాల్లో నాణ్యమైన సరుకుల వినియోగాన్ని ధ్రువీకరించే సర్టిఫికేషన్ ఉండాలి.
ఆలయాలు కేవలం ఆఽధ్యాత్మికతనే కాకుండా కళలు, విద్య, పర్యావరణ, సంక్షేమాలను అమలు చేసేలా ఉండాలి. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి.
సభ సక్సెస్
గంటా ఇరవై నిమిషాల పాటు వారాహి సభలో పవన్ ప్రసంగించారు. తిరుపతితో పాటు జిల్లావ్యాప్తంగానూ, ఇరుగుపొరుగు జిల్లాల నుంచీ పెద్ద సంఖ్యలో జన సైనికులు తరలివచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకా్‌షరెడ్డిలతో పాటు స్థానిక కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంచనాలకు అనుగుణంగా వారాహి సభ సక్సెస్ కావడంతో కూటమి పార్టీల నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.