Share News

Pawan Kalyan : లంచం మాటే వినపడొద్దు

ABN , Publish Date - Oct 20 , 2024 | 03:30 AM

కూటమి ప్రభుత్వంలో లంచం అనే మాట వినపడకూడదని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు.

Pawan Kalyan : లంచం మాటే వినపడొద్దు

  • పాలనలో మార్పులే నా ఆకాంక్ష

  • సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమష్టిగా పనిచేద్దాం

  • ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా

  • పాలన సాగించాలి: డిప్యూటీ సీఎం పవన్‌

  • జనసేనలో చేరిన ముద్రగడ కుమార్తె క్రాంతి

  • గుంటూరు, జగ్గయ్యపేట నుంచి భారీగా చేరికలు

అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వంలో లంచం అనే మాట వినపడకూడదని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. పాలనలో మార్పు తీసుకురావాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది రాష్ట్రానికి మూలమని, కీలకమైన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలను తీసుకున్నానన్నారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సమష్టిగా అన్ని శాఖలను ముందుకు తీసుకెళ్లేలా పని చేద్దామన్నారు. శనివారం జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్‌ సమక్షంలో పలువురు నాయకులు పార్టీలో చేరారు. వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి, అమలాపురానికి చెందిన కల్వకొలను తాతాజీ, గుంటూరుకు చెందిన చందు సాంబశివరావు, పలువురు గుంటూరు నగర పాలక సంస్థ కార్పొరేటర్లు, జగ్గయ్యపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లతో పాటు ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీలో చేరారు. వీరందరికి పవన్‌ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా నాయకులు బాధ్యతగా పని చేయాలి.


నాయకులు, పార్టీ కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న సమస్యలను తీర్చడంపై దృష్టిసారించాలి. జనసేన పార్టీని ఇంత మంది నాయకులు బలంగా నమ్ముతున్నారంటే మనపై ఉన్న నమ్మకమని గుర్తుంచుకోవాలి. దాన్ని నిలబెట్టుకునేలా పని చేద్దాం. అవినీతికి తావు లేకుండా, ప్రజలకు జవాబుదారీతనంతో ప్రభుత్వ పాలన ఉండాలి. నా కార్యాలయానికి ప్రజలకు సంబంధించి ఏ సమస్య తీసుకొచ్చినా దాని పరిష్కారం కోసం పని చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇటీవల పల్లె పండుగ ప్రారంభ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తాగునీటి కలుషిత సమస్యను నా దృష్టికి తీసుకువచ్చారు.

వెంటనే సమస్య పరిష్కారానికి అధికార యంత్రాంగాన్ని పంపాం. మొదటి విడతలో నందివాడ మండలంలో రూ.91 లక్షలతో ఫిల్టర్‌ బెడ్లు, ఇతర పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ప్రజలకు అవసరమైన సమస్యలను తీరుస్తూ వారి మన్ననలు పొందేలా ప్రతి ఒక్కరూ పని చేయాలి. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ నిలబెట్టుకునే విధంగా పాలన సాగించాలి’’ అని పవన్‌ అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అఽధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన సామినేని ఉదయభాను మొదటి నుంచి విలువలకు కట్టుబడి రాజకీయం చేశారని ప్రశంసించారు. అలాంటి వ్యక్తి పార్టీలోకి రావడం ఆనందం కలిగించిందన్నారు. ఆయన నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందనే నమ్మకం ఉందన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 06:31 AM