Pawan kalyan : పంచాయతీల్లో నిధుల దారిమళ్లింపు నిజం..
ABN , Publish Date - Jul 24 , 2024 | 05:33 AM
రాష్ట్రంలోని పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ.9వేల కోట్ల గ్రాంటును గత ప్రభుత్వం దారిమళ్లించిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
కమిషన్ వేసి అక్రమాల గుట్టు తేలుస్తాం
జగన్ నిర్వాకంతో 11కోట్ల జరిమానా
శాసనమండలిలో వెల్లడించిన పవన్ కల్యాణ్
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పంచాయతీలకు 14, 15వ ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ.9వేల కోట్ల గ్రాంటును గత ప్రభుత్వం దారిమళ్లించిన మాట వాస్తవమేనని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. పంచాయతీ నిధుల దారి మళ్లింపు అంశంపై మంగళవారం సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. పవన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అధికారులు పంచాయతీల్లో పర్యటించి గత ప్రభుత్వం హయాంలో జరిగిన అవకతవకలను గుర్తించారన్నారు. ఎన్ని నిధులు దారిమళ్లించారన్న విషయంపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుందని, దీనిపై కమిషన్‌ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా... గత ప్రభుత్వంలో అవి పంచాయతీలకు సకాలంలో వెళ్లలేదన్నారు. రూ.998కోట్ల ఆర్థిక సంఘం నిధులు ఇంకా విడుదల కావాల్సి ఉందన్నారు. గత మూడు సంవత్సరాల్లో ఆర్థికసంఘం 8విడతల్లో రూ.7,518 కోట్లు పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసిందని, ఆ సొమ్ముకు తన వాటాను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో దాదాపు రూ. 11 కోట్ల పెనాల్టీని కేంద్రానికి కట్టాల్సి వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి పంచాయతీలకు వచ్చిన నిధులు ఎప్పుడూ ఆలస్యంగానే వెళ్లేవని, గత ప్రభుత్వంలో సర్పంచ్‌ల అనుమతి లేకుండానే రూ.2,165 కోట్లు డిస్కమ్‌లకు కట్టారని పవన్ తెలిపారు. గ్రామ సచివాలయాల్లో సర్పంచ్‌లకు సముచిత స్థానం లేదని తమ దృష్టికి వచ్చిందని, వారికి గౌరవ, మర్యాదలు దక్కేలా చూస్తామని చెప్పారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, రాంగోపాల్‌రెడ్డి ప్రశ్నలు అడిగారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.,. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు దారిమళ్లకుండా రాష్ట్ర స్థాయిలో చట్టం చేయాలని కోరారు. మరో పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఇళ్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పంచాయతీల్లో చిన్న చిన్న మొత్తాలను దారి మళ్లించడంతో పంచాయతీల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.