Share News

వలంటీర్లపై వ్యాఖ్యల కేసులో పవన్‌ కల్యాణ్‌కు ఊరట

ABN , Publish Date - Jul 31 , 2024 | 02:59 AM

ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది.

వలంటీర్లపై వ్యాఖ్యల కేసులో  పవన్‌ కల్యాణ్‌కు ఊరట

జగన్‌ సర్కారు పెట్టిన కేసులో తదుపరి చర్యలు నిలిపేసిన హైకోర్టు

సుప్రీం తీర్పునకు విరుద్ధంగా కేసు.. గత ప్రభుత్వంలో ఇలాంటివెన్నో

అన్నిటిపై కొత్త సర్కారు పునఃపరిశీలన.. నిర్ణయాన్ని నివేదిస్తాం: ఏజీ

అమరావతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. వారాహి యాత్రలో గ్రామ-వార్డు సచివాలయ వలంటీర్లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ జగన్‌ ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన క్రిమినల్‌ కేసులో తదుపరి చర్యలన్నిటినీ న్యాయస్థానం నిలుపుదల చేసింది. ఫిర్యాదుదారు ఎంఎస్‌ సిరాజుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది. విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కె కృపాసాగర్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. వలంటీర్లపై తాను అనుచిత వ్యాఖ్యలు చేశానని, ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాననే ఆరోపణలతో అప్పటి వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులోని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా తనపై నమోదు చేయించిన ప్రైవేటు క్రిమినల్‌ కేసును కొట్టివేయాలని కోరుతూ పవన్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రాజకీయ కక్షతోనే పవన్‌పై అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 199(2) కింద కేసు నమోదు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని, గుంటూరు కోర్టులో విచారణను నిలుపుదల చేయాలని అభ్యర్థించారు. అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ.. పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు.. కేకే మిశ్రా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసిన కేసులు అనేకం ఉన్నాయని.. వీటన్నిటినీ పునఃపరిశీలించి, ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని.. సదరు నిర్ణయాన్ని కోర్టు ముందు ఉంచుతామని.. విచారణను వాయిదా వేయాలని కోరారు. వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. గుంటూరు కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేశారు.

Updated Date - Jul 31 , 2024 | 07:32 AM