Share News

ఆకురౌడీలకు భయపడతామా?

ABN , Publish Date - May 08 , 2024 | 04:33 AM

ప్రతి పనికీ కమీషన్లు పంచుకునే తండ్రీకొడుకులకు తిరుపతి ప్రజలు భయపడాలా అని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి అభ్యర్థి అభినయ్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు.

ఆకురౌడీలకు భయపడతామా?

రూ.200 కోట్ల కమీషన్ల కోసం

సత్రాలను కూల్చి కొత్తవి కడుతున్నారు

భూమన, అభినయ్‌పై జనసేనాని ధ్వజం

టీడీఆర్‌ బాండ్ల పేరుతో 2 వేల కోట్లు నొక్కేశారు

తిరుమల హుండీ కానుకలనూ దోచేశారు

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చెవిరెడ్డి

కోట్లు గడించారు: పవన్‌

  • భూమన, అభినయ్‌పై పవన్‌ ధ్వజం

ప్రతి పనికీ కమీషన్లు పంచుకునే తండ్రీకొడుకులకు తిరుపతి ప్రజలు భయపడాలా అని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడు, తిరుపతి అభ్యర్థి అభినయ్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. తిరుపతి రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. ఏడుకొండలవాడిని పైన పెట్టుకుని ఆకు రౌడీలకు భయపడడం ఏమిటని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం రాగానే ఆకు రౌడీలను ఉక్కు పాదంతో తొక్కిపడేస్తామన్నారు. ‘ఇల్లు కట్టాలంటే కరుణాకరరెడ్డికి 30 శాతం, ఆయన కొడుకు అభినయ్‌కి 10శాతం కమీషన్‌ ఇవ్వాలట కదా! రూ.200 కోట్ల కమీషన్ల కోసం తిరుపతిలో గోవిందరాజస్వామి సత్రాలను కూలదోసి కొత్తవి కడుతున్నారు. టీడీఆర్‌ బాండ్ల పేరుతో రూ.2 వేల కోట్లు నొక్కేశారు.

తిరుమల హుండీలో వేసిన కానుకలనూ దోపిడీ చేశారు. ప్రతి పనికీ పది నుంచి 15 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఖజనాకు ఆదాయం వస్తుంటే వైసీపీ నాయకులు కొండపై తిష్ఠవేసి ఖాళీ చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో కోట్లు గడించారు’ అని దుయ్యబట్టారు.

రోడ్‌షో, పుంగనూరు సభలకు పోటెత్తిన జనం

తిరుపతి రోడ్‌షోకు, పుంగనూరు బహిరంగ సభకు జనం పోటెత్తారు. తిరుపతిలో పవన్‌ను చూసేందుకు ఆయన అభిమానులు ఓవైపు, టీడీపీ అధినేత కోసం ఆ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలిరావడంతో రోడ్‌షో జరిగిన ప్రధాన రహదారులు, కూడళ్లు జనంతో కిక్కిరిసిసోయాయి. రేణిగుంటలోని ఎయిర్‌పోర్టు నుంచి కరకంబాడి మార్గంలో వచ్చిన అధినేతలిద్దరికీ జనం బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా ప్రజలు ప్రత్యేకించి మహిళలు, యువత గంటల కొద్దీ నిరీక్షించి స్వాగతం పలికారు.


తిరుపతి లీలా మహల్‌ నుంచి రోడ్‌షో ప్రారంభమైంది. అయితే ఆ కూడలి చేరుకునే సరికి శ్రీనివాస ఫ్లై ఓవర్‌పై విద్యుద్దీపాలు ఆర్పేశారు. దీంతో అంధకారం నెలకొంది. కూటమి పార్టీల కార్యకర్తలు మొబైల్‌ ఫోన్లలో టార్చిలైట్లు వెలిగించి పట్టుకోవడంతో ఎటు చూసినా వెలుగుతున్న మొబైల్‌ ఫోన్లే కనిపించాయి. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటనలో ప్రధాన కూడలిలో లైట్లు ఆర్పివేయడం ఆందోళన కలిగించింది. మొత్తం పర్యటనలో పోలీసు బందోబస్తు చాలా బలహీనంగా కనిపించింది.

కాగా.. పుంగనూరు నుంచి తిరుపతికి చేరుకునే క్రమంలో బాగా ఆలస్యం జరగడం, ఎన్నికల నిబంధనల కారణంగా రాత్రి 10 గంటల్లోపే సభ ముగించాల్సి ఉండడంతో చంద్రబాబు తిరుపతిలో 14 నిమిషాలే ప్రసంగించారు. పవన్‌ కూడా కొద్దిసేపే మాట్లాడారు.

పెద్దిరెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరం: కిరణ్‌ కుమార్‌ రెడ్డి

‘క్షణం సంతోషం కోసం జీవితాన్ని పాడు చేసుకోవద్దని ఎయిడ్స్‌ ప్రకటన వచ్చేది. ఇప్పుడు వైసీపీ వాళ్లు ఇచ్చే డబ్బుల కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు’ అని మాజీ సీఎం, రాజంపేట లోక్‌సభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. పెద్దిరెడ్డి ఎయిడ్స్‌ కంటే ప్రమాదకరమన్నారు. ఆయన అక్రమాలు, అవినీతి గురించి తాము మాట్లాడితే దానికి స్పందించడకుండా ఏదేదో మాట్లాడుతున్నారని ఆక్షేపించారు.

‘డీసీసీ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్నాడు. దానికి కూడా సమాధానం లేదు. జగన్‌రెడ్డిని నేను అరెస్టు చేయించానని చెప్పాడు. షర్మిలే చెప్పింది సోనియాకు సంబంధం లేదని! సత్యసాయిబాబా ట్రస్టు నుంచి బంగారమంతా తీసుకెళ్లానన్నాడు. నేను ప్రమాణం చేస్తానని చెప్పాను. దానికీ పెద్దిరెడ్డి స్పందించలేదు’ అని విమర్శించారు.

Updated Date - May 08 , 2024 | 04:33 AM