Share News

Pawan Kalyan : రేపు తిరుమలకు పవన్‌ కల్యాణ్‌

ABN , Publish Date - Sep 30 , 2024 | 03:59 AM

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు.

 Pawan Kalyan : రేపు తిరుమలకు పవన్‌ కల్యాణ్‌

2న శ్రీవారిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం

లడ్డూ కౌంటర్‌, వెంగమాంబ కాంప్లెక్స్‌ పరిశీలన

3న దీక్ష విరమణ.. తిరుపతిలో వారాహి సభ

అమరావతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌.. తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబరు 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకుని.. అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షా మాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్న ప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష గురువారానికి పూర్తవుతుంది. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుంటారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన వారాహి సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.

Updated Date - Sep 30 , 2024 | 04:02 AM