నేడు పెన్షన్లు పడవు!
ABN , Publish Date - May 01 , 2024 | 04:24 AM
మే 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తాం’ అని సర్కారు తొందరపడి ప్రకటించింది. ఇప్పుడు నాలుక్కరుచుకుని ‘తగిన చర్యలు’ తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.
బ్యాంకులకు ‘మే డే’ సెలవు
‘తగిన చర్యలు’ తీసుకోవాలన్న శశిభూషణ్
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ‘మే 1వ తేదీన పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తాం’ అని సర్కారు తొందరపడి ప్రకటించింది. ఇప్పుడు నాలుక్కరుచుకుని ‘తగిన చర్యలు’ తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. మే1వ తేదీన పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఖాతాలు లేని వాళ్లకు సిబ్బంది పంపిణీ చేస్తారని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే... మే 1వ తేదీ ‘కార్మికుల దినోత్సవం’ సందర్భంగా బ్యాంకులకు సెలవు. ఈ విషయం మంగళవారం రాత్రి గుర్తుకొచ్చినట్లుంది. అందుకే... ‘ప్రతి సంవత్సరంలాగే... మే డే సందర్భంగా బ్యాంకులకు సెలవని జిల్లా కలెక్టర్లు, పింఛను లబ్ధిదారులు గమనించాలని మనవి. దీనిని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోగలరు’ అని ఒక ప్రకటన జారీ చేశారు. దీని అర్థం.. బుధవారం పింఛన్ల పంపిణీ ఉండదనే!