పిన్నెల్లి అరాచకం
ABN , Publish Date - May 22 , 2024 | 04:18 AM
పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
స్వయంగా ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే
పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లో ఘటన
సీసీ కెమెరాలో రికార్డయిన విధ్వంసం
అడ్డుకున్న ఏజెంట్‌పై గొడ్డలి వేటు
మాచర్లలో ఏడుచోట్ల ఈవీఎంల ధ్వంసం
తీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్
సంబంధీకులపై కఠిన క్రిమినల్ చర్యలు
డీజీపీకి సూచించాలని సీఈవోకు ఆదేశం
పిన్నెల్లిని నిందితుడిగా చేర్చిన పోలీసులు
ఆయనపై అనర్హత వేటు వేయండి: టీడీపీ అభ్యర్థి
గుంటూరు/అమరావతి-ఆంధ్రజ్యోతి/మాచర్ల, మే 21: పోలింగ్ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. టీడీపీ శ్రేణులపై దాడులతో పాటు ఓటమి భయంతో పిన్నెల్లి సోదరులు బూత్‌లలోకి స్వయంగా చొరబడి ఈవీఎంలను ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ ఏజెంట్లపై పోలింగ్ బూత్‌లోనే దాడిచేశారు. పిన్నెల్లి దాష్టీకాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది. ఈ నెల 13న రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండగా.. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయని.. తనకు ఓట్లు వేయడం లేదన్న అక్కసుతో పిన్నెల్లి బరితెగించారు. గ్రామంలోని 202వ నంబర్ పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించి.. ఈవీఎంను ఎత్తి నేలకేసికొట్టారు. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంటుపై ఆయన, ఆయన అనుచరులు దాడిచేశారు. అలాగే మరో ఏడు పోలింగ్ కేంద్రాల్లోనూ పిన్నెల్లి ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ ఏజెంట్‌పై అదేరోజు బూత్ బయటే గొడ్డలితో దాడి చేశారు.
202వ బూత్ వీడియో మంగళవారం రాత్రి వెలుగు చూసింది. దీనిపై ఈసీ తీవ్రంగా స్పందించింది. అన్ని పోలింగ్ కేంద్రాల వీడియో ఫుటేజీని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులకు అప్పగించారని.. విచారణ అనంతరం పిన్నెల్లిని నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తమకు తెలియజేశారని సీఈవో కార్యాలయం వెల్లడించింది. ఈవీఎంల ధ్వంసంలో ప్రమేయం ఉన్నవారందరిపైనా కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవలసిందిగా డీజీపీకి సీఈవో సూచించారని, దీనివల్ల భవిష్యత్‌లో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసించరని తెలిపినట్లు పేర్కొంది. అయితే సిట్ రంగంలోకి దిగాక పోలీసులు పిన్నెల్లిపై కేసు పెట్టారా.. అంతకుముందే నమోదు చేశారా అన్న విషయంలో స్పష్టత లేదు. కాగా.. నియోజకవర్గంలో పోలింగ్ రోజు, ఆ మర్నాడు జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని 14న గృహనిర్బంధం చేశారు. కానీ అర్ధరాత్రి వారిరువురూ ఇంటి నుంచి పరారయ్యారు. వారు తప్పించుకుపోతున్నా పోలీసులు చోద్యం చూశారన్న విమర్శలున్నాయి. సదరు పోలీసులపై కూడా నేటి వరకు చర్యలు తీసుకోలేదు.
పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలి: జూలకంటి
ఎన్నికల రోజున అంతకుముందు ఆ తర్వాత అనేక రకాల అరాచకాలకు పాల్పడిన మాచర్ల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు వేయాలని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పాల్గొనకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని.. సిట్ అధికారులు కేసులు నమోదు చేసి ఎమ్మెల్యే సోదరులను వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కౌంటింగ్ రోజున కూడా వారు ఇదేవిధంగా అరాచకాలకు పాల్పడే అవకాశం ఉందని.. అందుచేత కౌంటింగ్ కేంద్రాల్లోకి రాకుండా వారిని నిరోధించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: లోకేశ్
సొంత బాబాయిని, ఓటేసి గెలిపించిన ప్రజలను.. చివరకు ప్రజాస్వామ్యాన్ని కూడా సీఎం జగన్ ఖూనీ చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతో పాటు దాడులకు తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఫ్యాక్షన్ రాజకీయాలపై జూన్ 4న ప్రజలు అసలు సిసలు తీర్పు ఇవ్వబోతున్నారని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.