పిఠాపురమే పవన్ శాశ్వత నివాసం
ABN , Publish Date - Apr 16 , 2024 | 03:13 AM
పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ శాశ్వత నివాస స్థలమని, ఇప్పటికే ఇక్కడ సొంత ఇంటిని నిర్మించే పనిలో ఉన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు.
ఇక్కడే సొంతిల్లు నిర్మాణం.. ప్రజలకు అందుబాటులో..
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు
పిఠాపురం, ఏప్రిల్ 15: పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కల్యాణ్ శాశ్వత నివాస స్థలమని, ఇప్పటికే ఇక్కడ సొంత ఇంటిని నిర్మించే పనిలో ఉన్నారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు తెలిపారు. శాసనసభ సమావేశాలు, కేంద్ర పర్యటనలు, పార్టీ కార్యకలాపాలు, సమావేశాల కోసం మినహా మిగిలిన సమయమంతా నియోజకవర్గంలోనే గడుపుతారని, ప్రజలకు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు, ఇబ్బందులు తెలుసుకునేందుకు, వినతులు స్వీకరించి వాటి పరిష్కార మార్గాలు చూపేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకున్నట్టు వివరించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలోని గోకులం గ్రాండ్‌లో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ... దేవాలయాలు, మసీదులు, చర్చిలతో పిఠాపురం మతసామరస్యంతో శాంతికి నిలయంగా ఉందన్నారు. అష్టాదశ శక్తి పీఠాల్లో దశమ శక్తి పీఠం కొలువైఉన్న పవిత్ర ఆధ్యాత్మిక పిఠాపురంలో పవన్ పోటీకి దిగడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. పిఠాపురాన్ని దక్షిణ కాశీగా తీర్చిదిద్దుతామన్నారు. పవన్ 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తే చట్టసభల్లో ప్రజాగళం వినిపిస్తారని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం కోసం పనిచేస్తారని చెప్పారు. వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాగబాబు తెలిపారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, కార్మికులు, వ్యాపారస్తులు ఎవరూ ఆనందంగా లేరని తెలిపారు. రాష్ట్రంలో 30వేల మంది మహిళలు అదృశ్యమైతే కనీసం ఆ అంశంపై సమీక్ష చేసే సమయం కూడా జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. తాము ఎవరికీ నష్టం చేయబోమని, తప్పు చేసిన వారిని మాత్రం వదలబోమని స్పష్టం చేశారు. సమావేశంలో జనసేన స్టార్ క్యాంపెయినర్ సాగర్, పిఠాపురం నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్, నాయకులు కడారి తమ్మయ్యనాయుడు, వెన్నా జగదీశ్, పిల్లా శివశకర్, వెన్నపు చక్రధరరావు, వేములపాటి అజయకుమార్, మహేందరరెడ్డి, శంకరగౌడ్ తదితరులు పాల్గొన్నారు.