Share News

29న విశాఖకు ప్రధాని మోదీ రాక

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:36 AM

రాష్ట్రానికి ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. విశాఖపట్నం పూడిమడకలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో 1200 ఎకరాల్లో నిర్మించే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లకు మోదీ శంకుస్థాపన చేస్తారు.

29న విశాఖకు ప్రధాని మోదీ రాక

  • గ్రీన్‌ ఎనర్జీ హబ్‌లకు శంకుస్థాపన

  • సాయంత్రం బహిరంగ సభ

  • హాజరు కానున్న చంద్రబాబు, పవన్‌

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఈ నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. విశాఖపట్నం పూడిమడకలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఎన్టీపీసీ సంయుక్త భాగస్వామ్యంతో 1200 ఎకరాల్లో నిర్మించే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌, గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ హబ్‌లకు మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారైంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. ఈ సభా వేదిక ద్వారా గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులతో సహా ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. రోడ్‌ షోలో కూడా మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎన్టీపీసీ రాష్ట్రంలో 1,87,000 కోట్లతో గ్రీన్‌ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను చేపట్టనున్నది. ఇందుకోసం ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. 1,06,250 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. తొలిదశ పనులు 2027 మే నాటికి పూర్తవుతాయి.

Updated Date - Nov 25 , 2024 | 04:36 AM