Share News

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

ABN , Publish Date - May 06 , 2024 | 04:07 AM

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి జగన్మోహన్‌ రెడ్డి అవినీతే కారణమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా పేర్కొన్నారు.

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

రాష్ట్రంలో గూండాగిరీ, అరాచకం.. మద్యం సిండికేట్‌.. షా ధ్వజం

అభివృద్ధికి పునాదులు వేసిన బాబు

వాటిని ధ్వంసం చేసిన జగన్‌

ఏపీ అభివృద్ధికి బాబు, మోదీ భరోసా

రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం

అమరావతి పునర్నిర్మాణం చేపడతాం

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఉద్ఘాటన

ధర్మవరంలో ‘ప్రజాగళం’ సభ

జగన్‌కు పాలించే అర్హత లేదు కేంద్రం ఇచ్చే నిధులన్నీ దుర్వినియోగం చేశారు

రాష్ట్రంలో డబులింజన్‌ సర్కార్‌ వస్తేనే అభివృద్ధి

చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడు: రాజ్‌నాథ్‌

అనంతపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి జగన్మోహన్‌ రెడ్డి అవినీతే కారణమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా పేర్కొన్నారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకే టీడీపీ, జనసేనతో బీజేపీ కూటమిగా ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు... కేంద్రంలో మోదీ సర్కార్‌ వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘ప్రజాగళం’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. జగన్‌ పాలనపై అమిత్‌షా మండిపడ్డారు. ఆయన ప్రసంగాన్ని ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌ యాదవ్‌ తెలుగులోకి అనువదించారు. ముఖ్యాంశాలు అమిత్‌షా మాటల్లోనే...

జగన్‌ను దించేందుకే కూటమి

ఏపీలో గూండాగిరి, నేరస్థుల అరాచకాలను అరికట్టేందుకు, జగన్‌ అవినీతి ప్రభుత్వాన్ని దించేందుకే కూటమిగా ఏర్పడ్డాం. రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా అంతం చేసేందుకు, ల్యాండ్‌ మాఫియాను అరికట్టేందుకు, ఏపీ రాజధానిగా అమరావతిని పునర్నిర్మించేందుకు, తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడేందుకు, ఉన్నతమైన తెలుగు భాషను పరిరక్షించేందుకే కూటమిగా ఏర్పడ్డాం. జగన్‌ సర్కారు ఇంగ్లిషు మీడియం పేరుతో తెలుగును అంతం చేయాలని చూస్తోంది. జగన్‌ రెడ్డీ.. చెవులు పెద్దవిగా చేసుకొని విను. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను ఎవరూ అంతం చేయలేరు!


రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం..

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడిలాంటిది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం దీనిని మంజూరు చేసింది. కానీ.. జగన్‌ రెడ్డి తన అవినీతితో పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేశారు. పనుల్లో జాప్యానికి ఆయన అవినీతే కారణం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులను జగన్‌ పూర్తిగా నిర్ల్యక్షం చేశారు. ఏపీలోని మొత్తం 25 ఎంపీ స్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించండి. హంద్రీనీవా సుజల స్రవంతి, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.

చంద్రబాబు ప్రగతి సాధకుడు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు విభజిత ఏపీని ప్రగతి పథంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన అభివృద్ధికి చిరునామా. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి గట్టి పునాదులు వేసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్ఠం చేశారు. కానీ... జగన్‌ వచ్చి ఈ రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించారు. జగన్‌ పాలనలో ఏపీలో అభివృద్ధి శూన్యం. పెట్టుబడులు సున్నా... అవినీతి మాత్రం కొండంత! రూ.13.50 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి జనం నెత్తిన మోపారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. రాష్ట్రంలో ల్యాండ్‌ మాఫియా పెట్రేగిపోతోంది. మద్యపాన నిషేధం చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అది చేయకపోగా.. మద్యం సిండికేట్‌తో అవినీతికి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో పేదలకు అడ్మిషన్‌ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోక్‌ సభకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌లో మోదీ సెంచరీ కొట్టేసి ముందంజలో ఉన్నారు. మూడో విడతలో 400 సంఖ్యను దాటబోతున్నాం. తెలంగాణలోనూ కమల వికాసమే! ఏపీలో చంద్ర బాబును సీఎంను చేయాలి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది.

నేడు రాష్ట్రానికి మోదీ

అనకాపల్లి, రాజమహేంద్రవరం, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రెండు ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. రాజమహేంద్రవరంలో విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.35 గంటలకు ఛత్తీ్‌సగఢ్‌లోని జగదల్‌పూర్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్‌ విమానంలో బయలుదేరి 3 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ 45 నిమిషాల పాటు వేదికపై ఉంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో అనకాపల్లి వెళతారు. రాజమహేంద్రవరంలో జరిగే సభలో ప్రధానితోపాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొంటారు. అనకాపల్లి సభలో మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. జాతీయ రహదారికి సమీపంలో ఒక లే అవుట్‌లో సుమారు 80 ఎకరాల్లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.

Updated Date - May 06 , 2024 | 04:07 AM