Polavaram : పరిపూర్ణంగా పోలవరం!
ABN , Publish Date - Nov 16 , 2024 | 05:03 AM
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
45.72 మీటర్ల ఎత్తు..194.6 టీఎంసీలు నిల్వ
నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి
స్టాప్ వర్క్ ఆర్డర్‌ను పూర్తిగా
ఎత్తేయాలని పట్టుబడదాం
ఈసీఆర్‌ఎ్‌ఫపై స్పష్టత కోరండి
2027 మే కల్లా పూర్తికి ప్రణాళికలు
జల వనరుల శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి స్థాయి సామర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని జల వనరుల శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల గరిష్ఠ ఎత్తులో నిర్మించి, 194.60 టీఎంసీల జలాలను నిల్వ చేసి గోదావరి మిగులు జలాలను రాష్ట్రమంతటికీ అందించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. అలాగే 45.72 మీటర్ల కాంటూరులో భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు నిధులు కేటాయించేలా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నుంచి సమ్మతి కోరేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏటా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇస్తున్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను సంపూర్ణంగా ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల కాంటూరులో నిర్మించేందుకు గత జగన్ ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల 115 టీఎంసీలను మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టును నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. పోలవరం సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై ఈ నెల ఐదో తేదీన వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, పోలవరం ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ రామ్‌సుందర్ రెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, కృష్ణా డెల్టా, పోలవరం, గోదావరి డెల్టా, ఒంగోలు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశం మినిట్స్‌ను శుక్రవారం విడుదల చేశారు.
పోలవరం ప్రాజెక్టును 2027 మే నాటికి పూర్తి చేసేందుకు వీలుగా అత్యంత కీలకమైన కొత్త డయాఫ్రమ్ వాల్‌ను పాతవాల్‌కు సమాంతరంగా నిర్మిస్తున్నందున.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ (ఈసీఆర్‌ఎఫ్) నిర్మాణాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న విషయంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి స్పష్టత కోరాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా డయాఫ్రమ్ వాల్‌తో సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్‌ను నిర్మించుకోవచ్చా లేదా అనే సంశయాలకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయాఫ్రమ్ వాల్‌తో సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ నిర్మించేందుకు కేంద్ర జల సంఘం ఆమోదం తెలిపితే అందుకు సంబంధించి పూర్తి ఆదేశాలను తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ ఎంత పొడవు మేర నిర్మించాక ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టాలో వెల్లడించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈసీఆర్‌ఎఫ్ పనులు ప్రారంభించాలంటే ప్రధాన డ్యామ్ వద్ద గోదావరి జలాల నిల్వ ఎంత మేరకు ఉంచాలో కూడా కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత కోరాలని సూచించారు. ఈసీఆర్‌ఎ్‌ఫను 30 మీటర్ల ఎత్తులో నిర్మించేంత వరకూ నీటిని నిల్వ చేయొచ్చా లేదా అనే అంశంపైనా కేంద్ర జల సంఘం నుంచి స్పష్టత తీసుకోవాలని సీఎం సూచించారు.
రక్షణ గోడల నిర్మాణానికి టెండర్లు
వరద జలాల రక్షణ గోడల నిర్మాణ పనుల కోసం టెండర్లను పిలవాలని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎడమ ప్రధాన కాలువ పనులను షెడ్యూల్ మేరకు పూర్తి చేయాలని సూచించారు. 41.15 మీటర్ల కాంటూరు దాకా భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలను పూర్తి చేయాలని ఆదేశించారు. సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టేందుకు అధికారులతో ప్యానల్ ఏర్పాటు చేయాలని సూచించారు.
చకచకా పనులు
ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణానికి అవసరమైన రాళ్లు, ఇతర మెటీరియల్‌ను సేకరించేందుకు వీలుగా స్పిల్ చానల్‌కు కుడివైపున ఉన్న కొండను తవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యేందుకు వీలుగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని స్పష్టం చేశారు. పోలవరం కుడి ప్రధాన కాలువను విస్తరించేందుకు తగిన ఆప్షన్లను పరిశీలించాలని సూచించారు. 2027 మే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల వేగాన్ని పెంచుతూనే చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధానంపైనా దృష్టిసారించాలన్నారు. అలాగే రెండేళ్లలో రూ.2,211 కోట్లతో పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పనులను పూర్తి చేయాలని జల వనరుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు.