Share News

హోంగార్డుల పిటిషన్లపై ముగిసిన వాదనలు

ABN , Publish Date - Dec 03 , 2024 | 05:34 AM

పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సామాజిక

హోంగార్డుల పిటిషన్లపై ముగిసిన వాదనలు

పోలీసు కానిస్టేబుళ్ల ఎంపికలో సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సామాజిక రిజర్వేషన్లను వర్తింపజేసి, ప్రిలిమినరీ పరీక్షలో తమకు క్వాలిఫైయింగ్‌ మార్కులు రాలేదంటూ తమను తదుపరి ఫిజికల్‌, తుది రాతపరీక్షకు అనుమతించలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాలపై ఇంతకుముందే విచారణ జరిపిన హైకోర్టు సామాజిక రిజర్వేషన్లతో సంబంధం లేకుండా పిటిషనర్లను ఫిజికల్‌, తుదిరాతపరీక్షకు అనుమతించాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇదే అంశంపై మరికొందరు హోంగార్డులు కూడా పిటిషన్లు దాఖలు చేయగా, వీటిపై హైకోర్టులో సోమవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపులా వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు శీనాకుమార్‌, శివరామ్‌, ఆంజనేయులు వాదనలు వినిపించారు. ‘పిటిషనర్లు ఎన్నో ఏళ్లుగా పోలీస్‌ శాఖలో హోంగార్డులుగా సేవలు అందిస్తున్నారు. వారిని సాధారణ అభ్యర్థులతో సమానంగా పోల్చి చూడడానికి వీల్లేదు. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్‌లో హోంగార్డుల కోసం మొత్తం 1167 పోస్టులు కేటాయించగా 382మంది మాత్రమే ప్రాథమిక పరీక్షలో ఎంపికయ్యారు. మిగిలిన పోస్టులను జనరల్‌ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేస్తున్నారు. దీని వల్ల హోంగార్డులకు నష్టం జరుగుతుంది. ప్రాథమిక రాత పరీక్షలో వచ్చిన మార్కులతో సంబంధం లేకుండా హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించి కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయాలి’ అని విన్నవించారు. అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను కానీ, అందులో నిబంధనలనుకానీ హోంగార్డులు సవాల్‌ చేయలేదన్నారు. ‘ప్రాథమిక పరీక్షలో కనీస మార్కులు సంపాదించి, తదుపరి ప్రక్రియకు ఎంపిక కానందుకే పిటిషనర్లు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేశాక, ఎంపిక ప్రక్రియ మధ్యలో నిబంధనలు మార్చడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో పిటిషన్లు చెల్లుబాటు కావు’ అని వాదించారు.

Updated Date - Dec 03 , 2024 | 05:34 AM