Prakasam district : దొరికిన దొంగలను వదిలేసి..
ABN , Publish Date - Jun 29 , 2024 | 06:33 AM
దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
చోరీ సొత్తు అప్పగింతలో చేతివాటం.. చీమకుర్తి సీఐపై సస్పెన్షన్ వేటు
ఒంగోలు (క్రైం), జూన్ 28: దొంగల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడమే కాకుండా దొరికిన సొత్తును అప్పగించడంలో చేతివాటం ప్రదర్శించిన ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల చీమకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన వేణుగోపాల్‌రెడ్డి, రఫీలను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అయితే వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడంతో తిరిగి ఈ నెల 4, 5 తేదీల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.
అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన దొంగతనం కేసులో 80 సవర్ల బంగారం పోయింది. కానీ, 40 సవర్లు మాత్రమే పోయినట్లు కేసు నమోదు చేశారు. అదేసమయంలో నిందితుల వద్ద 80 సవర్ల బంగారం దొరికింది. దీంతో బాధితులకు మొత్తం వెనక్కి ఇచ్చేందుకు సీఐ దుర్గాప్రసాద్ భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. జూన్ 4న చీమకుర్తిలో ఓ ఇంటి తలుపులు పగులకొట్టి దొంగతనం చేసేందుకు యత్నించిన వ్యక్తులను కూడా సీఐ వదిలేశారు. దీంతో వారు ఆ మరుసటి రోజే అద్దంకిలో మూడు ఇళ్లలో దొంగతనం చేశారు. అక్కడి నుంచి తిరిగొస్తూ ఈ నెల 6న చీమకుర్తిలో ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టారు. ఆ కారులో దొంగతనానికి అవసరమైన సామగ్రి దొరికింది. ఇలా వారు వరుస నేరాలకు పాల్పడుతున్నా పట్టించుకోలేదు. దీంతో చీమకుర్తి పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. సీఐ దుర్గాప్రసాద్ నిందితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించినట్టు నిర్దారించి ఆయనను సస్పెండ్ చేశారు.