నా కోసం 2 సార్లు బటన్ నొక్కండి
ABN , Publish Date - Apr 03 , 2024 | 03:33 AM
మదనపల్లె పట్టణంలో మంగళవారం సాయంత్రం జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్.. తనకు మాత్రమే అలవాటైన అబద్ధాలను అలవోకగా చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినా.
99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పరీక్షలకు ఎప్పుడైనా భయపడతాడా?
మదనపల్లె సభలో సీఎం జగన్
మదనపల్లె పట్టణంలో మంగళవారం సాయంత్రం జరిగిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్.. తనకు మాత్రమే అలవాటైన అబద్ధాలను అలవోకగా చెప్పారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి చేయకపోయినా..తమ మేనిఫెస్టోలోని అన్ని హామీలను నెరవేర్చామని పాత విషయాలనే ఏకరువు పెట్టారు. 2014లో వచ్చిన కూటమే.. మళ్లీ ఎన్నికల కోసం వస్తోందన్నారు. ఈ కూటమి అప్పట్లో రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా..ఇప్పుడు మళ్లీ ఒకటిగా వస్తోందని అన్నారు. తనను ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేకనే గుంపుగా వస్తున్నాయని సినిమా డైలాగులు చెప్పారు. తన ఒక్కడి మీద.. ఇంతమంది కలిసి దాడిచేస్తున్నారని బేలమాటలు మాట్లాడారు. 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పరీక్షలకు భయపడనట్లు.. తాను కూడా భయపడనని బీరాలు పలికారు. ఈ ఐదేళ్లలో 130సార్లు బటన్లు నొక్కానని, రాబోయే ఎన్నికల్లో తనకోసం రెండుసార్లు బటన్ నొక్కాలని కోరారు. గతంలో బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. అయితే గత ఐదేళ్లలో తాను కనీసం ఒకసారి కూడా ప్రత్యేక హోదా కోసం నోరెత్తక పోవడాన్ని ప్రస్తావించలేదు. వలంటీర్లు మన వాళ్లే అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పిస్తే.. చంద్రబాబు వల్లే వలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయలేకపోయారని వేలాది మంది సాక్షిగా అబద్ధం చె ప్పేశారు. వెరసి మదనపల్లెలో జగన్ సభ ఆత్మస్తుతి.. ప్రతిపక్షాలపై నిందలతోనే సాగింది. అయితే.. ముఖ్యమంత్రి ప్రసంగం మొదలు పెట్టకముందే.. జనం వెనుదిరగడం మొదలు పెట్టారు. ఆయన ప్రసంగం పూర్తయ్యే సమయానికి గ్యాలరీలు సగానికి పైగా ఖాళీ అయ్యాయి. కాగా.. మదనపల్లెలో సభ ముగిసిన అనంతరం సదుం మండలం చేరుకుని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేశారు.