Share News

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కల నెరవేరేనా?

ABN , Publish Date - Dec 20 , 2024 | 05:17 AM

కొన్నాళ్లుగా ఇరు దేశాలు ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కువైత్‌ అధికారిక పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు ప్రధాని కువైత్‌లో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కల నెరవేరేనా?

కువైత్‌లో పెద్దసంఖ్యలో రాయలసీమ ప్రవాసీయులు

విజయవాడ-గల్ఫ్‌ రోజువారీ సర్వీసులపైనా ఆశలు

21 నుంచి ప్రధాని మోదీ కువైత్‌ పర్యటనపై ఆసక్తి

4 దశాబ్దాల తర్వాత కువైత్‌కు భారత్‌ అధినాయకుడు

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కొన్నాళ్లుగా ఇరు దేశాలు ఎదురు చూస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కువైత్‌ అధికారిక పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఈ నెల 21 నుంచి రెండు రోజుల పాటు ప్రధాని కువైత్‌లో పర్యటించనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రధానికి స్వాగతం పలికేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. కువైత్‌లో శనివారం జరుగనున్న అరేబియన్‌ గల్ఫ్‌ కప్‌ ఫుట్‌ బాల్‌ కప్‌ పోటీలను తనతో పాటు కలిసి తిలకించాల్సిందిగా కువైత్‌ అమీర్‌ (రాజు) షేక్‌ మిశాల్‌ అహ్మద్‌ అల్‌ సభా ప్రధాని మోదీని ఆహ్వానించారని, మోదీ కూడా హారవుతారని అంతా భావిస్తున్నారు. ప్రధాని ప్రసంగించనున్నట్లుగా భావిస్తున్న అల్‌ సభా స్టేడియంలో భారత్‌లోని వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రవాసీయులతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనకు స్వాగతం పలికేందుకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఇందులో తమకు పెద్దగా భాగస్వామ్యం కల్పించడం లేదని, భద్రతా కారణాల సాకుతో మోదీని కలిసే అవకాశం కూడా దక్కేలా లేదని కొందరు తెలుగు ప్రవాసీ ప్రముఖులు వాపోతున్నారు.

ద్వైపాక్షిక చర్చలపైనే ప్రవాసాంధ్రుల ఆశలు

కొన్నాళ్ల క్రితమే ప్రధాని మోదీ కువైత్‌ పర్యటనకు రావాల్సి ఉన్నా వివిధ కారణాల వల్ల కుదరలేదు. 1981లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పర్యటన తర్వాత 43 సంవత్సరాల వ్యవధిలో భారత్‌ ప్రధానులెవ్వరూ కువైత్‌ పర్యటనకు రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే గల్ఫ్‌లోని మిగిలిన దేశాలతో పోల్చితే కువైత్‌తో భారత్‌ సంబంధాలు అంతగా లేవని చెప్పవచ్చు. ఇరాఖ్‌ చేసిన కువైత్‌ దురాక్రమణను భారత్‌ ఖండించకపోవడం దీనికి కారణంగా చెబుతారు. కువైత్‌ జనాభాలో స్థానిక పౌరులకు మించి అధిక సంఖ్యలో విదేశీయులు.. ముఖ్యంగా భారతీయులు ఉన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయలసీమ జిల్లాల ప్రవాసీయులు ప్రత్యేకించి ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన వారి సంఖ్య అధికం. ఈ నేపథ్యంలో కువైత్‌.. భారత్‌ మధ్య ఉన్న వారానికి 12 వేల విమాన సీట్లను 28 వేలకు పెంచాలని, కొత్త రూట్లలో ఎగిరేందుకు అనుమతించాలని కువైత్‌ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నా, భారత్‌ అంగీకరించడం లేదు. ప్రధాని పర్యటనలో దీనిపై అంగీకారం కుదిరితే, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం కల నెరవేరుతుంది. అలాగే, విజయవాడకు కువైత్‌కు చెందిన అల్‌ జజీరా ఎయిర్‌ వేస్‌ ద్వారా మొత్తం గల్ఫ్‌ దేశాలకు రోజువారీగా విమాన సౌకర్యం కలుగుతుందని ప్రవాసీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 05:17 AM