Share News

Goa Liquor: పులివెందులలో .... గోవా మద్యం

ABN , Publish Date - Oct 09 , 2024 | 12:10 AM

మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో అక్రమ మద్యం మూడు బీర్లు ఆరు ఫుల్లులు అనేలా సాగుతోంది. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకు వచ్చి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు.

Goa Liquor: పులివెందులలో ....  గోవా మద్యం
పోలీసులు పట్టుకున్న అక్రమ మద్యం (ఫైల్‌)

రాష్ర్టాలు దాటి అక్రమంగా వస్తున్న వైనం

చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌ పోలీసులు

సమాచారం ఉన్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరు

కోట్లు దండుకుంటున్న అక్రమ మద్యం విక్రయదారులు

పులివెందుల, అక్టోబరు 8: మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్‌ జగన్‌ సొంత నియోజకవర్గమైన పులివెందులలో అక్రమ మద్యం మూడు బీర్లు ఆరు ఫుల్లులు అనేలా సాగుతోంది. యథేచ్ఛగా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకు వచ్చి మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. జగన్‌ ప్రభుత్వంలో రాష్ట్రంలో మద్యం మంచి బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల మద్యం కోసం మద్యంప్రియులు ఎగబడ్డారు. ఇదే అదునుగా అక్రమ మద్యం విక్రయదారులు చెలరేగిపోయారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరినా ఇంకా కొత్త మద్యం పాలసీ అమలులోకి రాకపోవడంతో అక్రమ మద్యం వాప్యారం ఇక్కడ అడ్డూఅదుపూ లేకుండా సాగుతోంది. రూ.కోట్లు విలువచేసే మద్యం పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాలకు తరలివస్తోంది.

అక్రమ మద్యానికి పులివెందుల కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం వస్తోంది. గోవా నుంచి వయా బెంగళూరు మీదుగా పులివెందులకు అక్రమ మద్యం పెద్దఎత్తున చేరుతోంది. పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండుమూడు చోట్ల ఈ అక్రమమద్యాన్ని నిల్వచేసి అడిగిన వారికి అక్కడి నుంచి సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల మద్యం బాటిల్‌ అక్కడ రూ.1000కి కొనుగోలు చేసిన ఇక్కడ రూ.2000కు అమ్మినా మద్యంప్రియులు ఎగబడి కొంటున్నారు. ఇదే అదనుగా కొందరు అక్రమమద్యం అమ్మకాలతో కోట్లు గడించారు.


రూ.98 లక్షల మద్యం సీజ్‌

ఇటీవల పులివెందుల మీదుగా రెండు ఐచర్‌ వాహనాల్లో పెద్దఎత్తున పొరుగు మద్యం తరలివచ్చింది. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వెంబడించి ఒక వాహనాన్ని పట్టుకున్నారు. అప్పటికే మరో ఐచర్‌ వాహనం పోలీసుల కన్నుగప్పి చేరాల్సిన ప్రాంతానికి చేరినట్లు వార్తలు గుప్పుమన్నాయి. పులివెందుల పోలీసులకు సమాచారం రావడంతో ఒక వాహనాన్ని మాత్రం పట్టుకోగలిగారు. ఇది రాజకీయ నాయకులకు సంబంధించిన మద్యం అయి ఉంటుందని, ఇందులో పెద్దపెద్ద నాయకుల హస్తం ఉందనే చర్చ సాగింది. పట్టుకున్న వాహనాన్ని కూడా వదిలేస్తారేమో అనే అనుమానాలు వచ్చాయి. కానీ పోలీసులు దాదాపు రూ.98లక్షల అక్రమ మద్యాన్ని సీజ్‌ చేసినట్లు మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన మద్యం వాహనం, తప్పించుకున్న వాహనం.. ఈ రెండు వాహనాలే కాక ఇటీవల ఐదు నుంచి ఆరు వాహనాల్లో పులివెందుల, కడప ప్రాంతాలకు అక్రమంగా మద్యం చేరవేశారని తెలిసింది. అయితే రూ.98లక్షల మద్యం పట్టుబడిన తర్వాత అక్రమ మద్యం అమ్మకాల్లో కాస్త స్పీడ్‌ తగ్గించినట్లు పోలీసులు అంటున్నారు. కానీ అక్రమ మద్యం దిగుమతిమాత్రం ఆగలేదని మద్యంప్రియులు అంటున్నారు.


ఎమ్మార్పీ ఽధరలకు తెచ్చి..

బయటి రాష్ట్రాల నుంచి వచ్చే మద్యానికి ఎక్కువ గిరాకీ ఉడడంతో ఐదేళ్లుగా అలవాటు పడ్డ వారు ఈ వ్యాపారాన్ని వదులుకోలేకుండా ఉన్నారు. బయట రాష్ట్రాల్లో ఎమ్మార్పీధరలకు తీసుకొచ్చి ఇక్కడ దానిని రెట్టింపు ధరలకు అమ్మడం ద్వారా లక్షల ఆదాయం వస్తోంది. దీంతో వీరు ఏదోవిధంగా బయటి రాష్ట్రాల నుంచి మద్యం ఇక్కడకు తీసుకుని వస్తున్నారు. లోకల్‌ పోలీసులు అక్రమ మద్యంపై సమాచారం వస్తే పట్టుకునేందుకు ప్రయత్నం సాగిస్తున్నారు. కానీ పక్కా సమాచారం ఉన్నా ఎక్సైజ్‌పోలీసులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్దఎత్తున అక్రమ మద్యం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నా ఎక్సైజ్‌ పోలీసులు వీటిని పట్టుకోవడం కానీ, కేసులు పెట్టడం కానీ చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఏదిఏమైనా రాష్ట్రంలో దొరుకుతున్న నకిలీ మద్యం పుణ్యమా అని అక్రమ మద్యం వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా సాగుతోంది. అయితే.. ఇటీవల కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీకి విధివిధానాలను ప్రకటించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. ఆ తర్వాతైనా అక్రమ మద్యానికి చెక్‌ పడుతుందా.. లేక ఇదే తీరులో సాగుతుందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Oct 09 , 2024 | 12:10 AM