‘స్వచ్ఛ’ సేవకులు
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:43 PM
వన్యప్రాణులు, విభిన్న వృక్షజాతులకు నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై అటవీశాఖ నిషేధం విధించింది.
సమాజ సేవ చేస్తూ ఉపాధి పొందుతున్న యువకులు
నంద్యాల-గిద్దలూరు నల్లమల రహదారిలో వ్యర్థాల సేకరణ
ప్లాస్టిక్ రహిత నల్లమల కోసం తమవంతు కృషి
వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
శిరివెళ్ల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వన్యప్రాణులు, విభిన్న వృక్షజాతులకు నెలవైన నల్లమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగంపై అటవీశాఖ నిషేధం విధించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వ్యర్థాలతో వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. దీంతో ప్లాస్టిక్ రహిత నల్లమలగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ సేవకులను నియమించింది. నంద్యాల-గిద్దలూరు ప్రధాన రహదారిలో నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె నుంచి ప్రకాశం జిల్లా సరిహద్దుల్లోని దిగువమెట్ట ప్రాంతం వరకు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఈ స్వచ్ఛ సేవకులు ప్రతిరోజూ రహదారి వెంట పర్యటిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తున్నారు. పచ్చర్ల అటవీ సెక్షన పరిధిలో పలు గ్రామాలకు చెందిన 13 మంది యువకులు ఓ వైపు సమాజసేవలో భాగంగా బాధ్యతగా పని చేస్తూనే.. మరో వైపు ఉపాధి సైతం పొందుతున్నారు. రహదారి వెంట, అటవీ ప్రాంతంలో ప్రయాణికులు విసిరిపడేసే ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిళ్లను ఏరివేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో పోగు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛ సేవకులకు అటవీశాఖ నెలకు రూ.9 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది.
ఫ అవగాహన కల్పిస్తున్నాం : వసంత కుమార్, మహదేవపురం
రహదారిలో ప్రయాణించే వాహనదారులు, ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే వారికి ప్లాస్టిక్ రహిత నల్లమల కోసం చేపట్టిన ప్రణాళికపై అటవీశాఖ సిబ్బందితో కలిసి అవగాహన కల్పిస్తున్నాం. అటవీ ప్రాంతంలో ఎక్కడబడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లోనే వేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
ఫ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : రంగస్వామి, పచ్చర్ల
పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వచ్ఛ సేవకుడిగా అటవీ ప్రాంతంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేస్తూ ఉపాధి పొందుతున్నాను. వ్యర్థాల వల్ల వన్యప్రాణులకు కలిగే ముప్పును ప్రయాణికులకు తెలియజేస్తున్నాం.
ఫ కుటుంబానికి చేదోడువాదోడుగా.. : క్రాంతి కుమార్, ఆంజనేయకొట్టాల
కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు స్వచ్ఛ సేవకుడిగా పని చేస్తున్నాను. ప్రజలందరూ సహకరిస్తేనే ప్లాస్టిక్ రహిత నల్లమలగా తీర్చిదిద్దవచ్చు. పదో తరగతి వరకు చదువుకున్నాను. నల్లమల అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ స్వయం ఉపాధి పొందుతున్నాను.