‘రాఘవేంద్రరెడ్డికి సహకరించేదిలేదు’
ABN , Publish Date - Mar 15 , 2024 | 12:04 AM
తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మాధవరం రాఘవేంద్ర రెడ్డికి సహకరించేది లేదని మండల టీడీపీ నాయకులు ముక్తకంఠంతో నిరసన తెలిపారు.
కౌతాళం, మార్చి 14: తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంత్రాలయం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన మాధవరం రాఘవేంద్ర రెడ్డికి సహకరించేది లేదని మండల టీడీపీ నాయకులు ముక్తకంఠంతో నిరసన తెలిపారు. కౌతాళంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప నివాసం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. టీడీపీ రైతు విభాగ రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు అడివప్పగౌడ్, వెంకటపతిరాజు, క్లస్టర్-2 ఇన్‌చార్జి కోట్రేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కోసిగి : మంత్రాలయం సీటుకు తిక్కారెడ్డిని ప్రకటించకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోసిగిలోని వాల్మీకి సర్కిల్‌లో టీడీపీ నాయకులు వక్రాణి వెంకటేశ్, పెండ్యాల భరద్వాజశెట్టి, వీరారెడ్డి, ఈరయ్య, నాడిగేని కోసిగయ్య, ఖలందర్, నర్సారెడ్డి, నరసింహులు నిరసన వ్యక్తంచేశారు. కొందరు కార్యకర్తలు, పెట్రోల్, డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. అనంతరం టైర్లకు నిప్పు పెట్టి రోడ్డుపై బైఠాయించి తిక్కారెడ్డికి సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మంత్రాలయంలో నిరసన ప్రదర్శన
మంత్రాలయం : మంత్రాలయం టీడీపీ టికెట్ ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డికే ఇవ్వాలని, లేకపోతే టీడీపీకి మంత్రాలయం నియోజకవర్గం నుంచి మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని మండల కన్వీనర్ పన్నగ వెంకటేశ్, బూదూరు మల్లికార్జున రెడ్డి, సత్యనారాయణరెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి ఎల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చావిడి వెంకటేశ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు అమర్నాథ్ రెడ్డిలు డిమాండ్ చేశారు. టీడీపీ అధిష్టానం ప్రకటించిన రెండో జాబితాలో తిక్కారెడ్డి పేరు కాకుండా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కోవర్టుగా ఉండి మూడు నెలల కింద పార్టీలో చేరిన రాఘవేంద్రరెడ్డికి ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు.