రమణారెడ్డి అవుట్!
ABN , Publish Date - Oct 10 , 2024 | 03:35 AM
గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులుగా ముద్రపడిన వారు కూటమి ప్రభుత్వంలోనూ హల్‌చల్ చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ప్రభుత్వంలో కదలిక మొదలైంది.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎ్‌ఫవోకు చెక్
ఆయన నియామకాన్ని నిలిపేసిన సర్కార్
జగన్ పత్రిక రిపోర్టర్‌కు మంత్రి సిఫారసూ తిరస్కృతి
ఫైబర్‌నెట్‌లోకి జగన్ మనుషులపైనా సీరియస్
అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వంలో వైసీపీ అధికారులుగా ముద్రపడిన వారు కూటమి ప్రభుత్వంలోనూ హల్‌చల్ చేస్తున్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ఏపీపవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా రమణారెడ్డిని మూడేళ్లపాటు నెలకు లక్ష రూపాయల జీతానికి నియమిస్తూ కార్పొరేషన్ ఎండీ ఎం.జానకి ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం నిలిపేసింది. జగన్ పత్రిక పూర్వ రిపోర్టరును జెన్కోలో సీనియర్ కన్సల్టెంట్‌గా తిరిగి నియమించాలంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన సిఫారసు ఫైలును ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తిరస్కరించారు. ఫైబర్‌నెట్ కార్పొరేషన్‌లో ఇప్పటికీ జగన్ మనుషుల నియామకాలపై తీవ్రస్థాయిలో చర్చమొదలైంది. ‘‘పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎ్‌ఫవోగా రమణారెడ్డి పునర్నియామకం’’ పేరిట ఆంధ్రజ్యోతిలో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై .. ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులతో సహా .. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆరా తీశారు. ఈ నియామకంపై ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను ఆరా తీశారు. అయితే.. ఈ నియామకం ఇంధన శాఖ పరిధిలో జరగలేదని విజయానంద్ చెప్పారు. దీంతో.. రమణారెడ్డికి నియామక ఉత్తర్వులు ఎవరిచ్చారని మరోదఫా సమీక్షించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో ఐఏఎస్ అధికారిణి జానకి ఈ నెల ఒకటో తేదీన దీనిపై మెమో ఇచ్చినట్టు గుర్తించారు. దీంతో.. ఇంధనశాఖ పరిధిలో తీసుకోవాల్సిన నిర్ణయం .. ఆర్థికశాఖ ఎందుకు తీసుకున్నదంటూ .. లోతుగా ఆరా తీశారు.
ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండటం .. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంలో కీలకపాత్రను పోషించడం వంటి అంశాల నేపథ్యంలో .. ఈ కార్పొరేషన్‌ను రాష్ట్ర ఆర్థికశాఖ పర్యవేక్షిస్తోందని సీఎ్‌సకు ఉన్నతాధికారులు వివరించారు. దీంతో.. ఈ నియామకాన్ని నిలుపుదల చేశారు. నిజానికి, రిటైర్ అయిన ఉద్యోగులను పునర్నియామకం చేయడంపై ఇప్పటికే ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీని సంప్రదించకుండా రమణారెడ్డిని నేరుగా కార్పొరేషన్‌లో కీలక అధికారిగా నియమించడాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. ఇదేసమయంలో..గతంలో జగన్ పత్రికలో పనిచేసిన రఘురామిరెడ్డిని జెన్కోలో తిరిగి సీనియర్ కన్సల్టెంట్‌గా నియమించాలంటూ మంత్రి ఆనం రామానారాయణరెడ్డి... ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రమికుమార్‌కు సిఫారసు చేశారు. దీనిపై ఫైలు ముందుకు కదిలింది. దీనిపైనా .. సీఎంఓ .. సీఎస్ ఆరా తీశారు. మంత్రి గొట్టిపాటితో మాట్లాడారు. రఘురామిరెడ్డి నియామకం కోసం ఎవరు సిఫారసు చేశారని అడిగారు. దీంతో .. సహచర మంత్రి నుంచి వచ్చిన సిఫారసు లేఖపై యథాలాపంగా పరీశీలించి .. చర్యలు తీసుకోవాలని మాత్రమే రాశానని రవికుమార్ వివరించారు. అనంతరం .. మంత్రి ఆనం చేసిన నియామక సిఫారసు వ్యవహారాన్ని తక్షణమే నిలుపుదల చేస్తూ ఇంధన శాఖకు గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో, ఫైబర్‌నెట్‌లో జరిగిన నియామకాలపైనా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. వైసీపీ సానుభూతిపరులకు ఫైబర్‌నెట్‌లో పునరావాసాన్ని కల్పించడంపై ప్రభుత్వపెద్దలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ కీలక అధికారులు అభిప్రాయపడుతున్నారు.