రామేశ్వరం మొగ ముంపు నివారణకు పులికాట్ సరస్సులా డ్రెడ్జింగ్ : కలెక్టర్
ABN , Publish Date - Dec 21 , 2024 | 01:22 AM
కూనవరం నుంచి రామేశ్వరం మొగ వరకు ముంపు సమస్య నివారణకు తిరుపతి జిల్లా పులికాట్ సరస్సు మాదిరిగా పూడికతీత, డ్రెడ్జింగ్ పనుల నిర్వహణకు నివేదిక రప్పించి పనులు చేపట్టాలని జలవనరులశాఖ ఇంజనీర్లను కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు.
అమలాపురం, డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): కూనవరం నుంచి రామేశ్వరం మొగ వరకు ముంపు సమస్య నివారణకు తిరుపతి జిల్లా పులికాట్ సరస్సు మాదిరిగా పూడికతీత, డ్రెడ్జింగ్ పనుల నిర్వహణకు నివేదిక రప్పించి పనులు చేపట్టాలని జలవనరులశాఖ ఇంజనీర్లను కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఆదేశించారు. జిల్లాలోని పంటకాల్వలు, డ్రైనేజీల్లో గుర్రపుడెక్క, పూడికతీత పనులు, కాల్వగట్లను మట్టితో బలోపేతం చేసే పనులను జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో చేపట్టేందుకు పనుల జాబితాను ఆయా శాఖల అధికారులు సమన్వయంతో రూపొందించాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జలవనరులశాఖ, డ్రైనేజీ విభాగం ఇంజనీర్లు, డ్వామా పథక సంచాలకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుకు బలహీనంగా ఉన్న పంటకాల్వల ఏటిగట్లు, డ్రైనేజీ గట్ల స్థితిగతులను పరిశీలించి కార్యాచరణను రూపొందించాలన్నారు. ఇప్పటికీ నోటిఫికేషన్ చేయని డ్రైనేజీలను నోటిఫై చేసేందుకు విధి విధానాలను సమీకరించి చర్యలు చేపట్టాలని జేసీ టి.నిషాంతికి సూచించారు. గోదావరి ఏటిగట్టు, పంటకాల్వలు వంటి వాటిని జియో టెక్స్‌టైల్స్ విధానం ఆచరించడం ద్వారా పచ్చిక లేయర్లతో బలోపేతం చేసేందుకు గత సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని సూచించారు. కాల్వలు మూసివేసే సమయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఇప్పటినుంచే అంచనాల రూపకల్పన చేసి నిధులు మంజూరుకు చర్యలు చేపట్టాలన్నారు. నీటితీరువా పనులు వసూళ్ల ఆధారం గానే అభివృద్ధి పనులకు నిధులు సమకూరతాయన్నారు. చిన్నపాటి పంట బోదెల్లో పూడికతీత పనులు ఆయా మండల పరిషత్ అభివృద్ధి అధికారులే నరేగా అనుసంధానంతో చేపట్టడం జరుగుతుందన్నారు. సమావేశంలో డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, గోదావరి హెడ్‌వర్క్స్ కె.కాశివిశ్వేశ్వరరావు, డ్రైనేజీ విభాగం ఈఈ ఎంవీవీ కిశోర్, జలవనరులశాఖ ఈఈ పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.